Aug 15,2023 00:19

కాలినడకన బోనులో పడ్డ చిరుత

ప్రజాశక్తి- తిరుమల: తిరుమలలో కాలినడకన భక్తులకు జంతువుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే చిరుత సంచారంతో భక్తులు భయంగా భయంగా ఒక్కో మెట్టు ఎక్కుతుండగా.. తాజాగా నడకమార్గంలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ఈనెల 14వ తేదీ ఉదయం శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. ఎలుగును చూడగానే భయంతో పరుగులు పెట్టారు. 2000 మెట్టు దగ్గరకు వెళ్లాక ఎలుగుబంటి కనిపించిందని భక్తులు తెలిపారు. ఈవిషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో అలర్ట్‌ అయిన అధికారులు ఎలుగు బంటి కోసం గాలిస్తున్నారు. భక్తులు భయపడకుండా ముందుసాగాలని.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని టిటిడి ఈవో ధర్మారెడ్డి తెలిపారు. చిరుతను బోనులో బంధించిన తరువాత ఈవో మీడియాతో మాట్లాడారు. తిరుమల కాలినడక మార్గంలో ఈనెల 13వ తేదీ అర్థరాత్రి ఓ చిరుత బోనులో చిక్కిందని, చిన్నారి లక్షితను చంపేసిన చిరుత అదే కావచ్చని భావిస్తున్నామని, దాన్ని తిరుపతి జూకి తరలించి అక్కడ దానికి బ్లడ్‌ శాంపిల్‌ టెస్టులు చేసి.. చిన్నారిని చంపిన చిరుతపులి అదా, కాదా అన్నది తేల్చనున్నట్లు పేర్కొన్నారు.
ఇలాంటి సమయంలో మరో చిరుతపులి కనిపించిందనే ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. 14వ తేదీన మరో చిరుత కనిపించిందని భక్తులు తెలిపారు. అలిపిరి నడక మార్గంలోని నామాల గవి ప్రాంతంలో వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించింది. దీంతో వారు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఇప్పటికైతే చిరుత అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కానీ మళ్లీ ఆ చిరుత వచ్చి ఎక్కడ్నుంచి వస్తుందో, దాడి చేస్తుందేమోనన్న భయం ఇప్పటికీ అక్కడున్న వారిని వెంటాడుతోంది. చిరుతల కోసం తిరుమలలో మొత్తం నాలుగు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. 13వ తేదీ కాలినడక మార్గాల్లో ఐదు ప్రదేశాల్లో అధికారులు 5 చిరుత పులుల పాద ముద్రలను గుర్తించారు. దీంతో కాలినడక మార్గాల్లో ఐదు పులులు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆ క్రమంలోనే.. ఈ బోన్లు ఏర్పాట్లు చేశారు. అర్థరాత్రి ఒకపులి ఆల్రెడీ చిక్కింది. మిగతా 4 చిరుతల కోసం వేటాడుతున్నారు. పులులను ట్రాక్‌ చేసేందుకు తిరుమల నడక మార్గంలో 15 చోట్ల ట్రాకింగ్‌ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 500 వరకు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.