తప్పెవరిది.. శిక్షెవరికి..?
కడియుద్ద ఘటనపై అనుమానాలెన్నో
నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
150 మీటర్ల దూరానికి ఎగిరిపడిన శరీర భాగాలు
ఎక్కడ చూసినా బీతావాహమే
అనుమతులు తక్కువ.. తయారీ ఎక్కువ
అదే ప్రమాదానికి మూలకారణం?
అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం రూరల్
తప్పు ఒకరు చేస్తే.. శిక్ష మరొకరికి పడింది.. కూలీ..నాలీ చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా జీవనం సాగిస్తున్న కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నిపింది.. నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది.. ఎవరి మృతదేహం ఎవరిదో కనీసం గుర్తుపట్టలేనంత బీతావాహాన్ని నెలకొల్పింది.. తునాతునకలైన మృతదేహాలను చూసిన మృతుల బంధువులను గుండెలవిసేలా విలపించేలా చేసింది..
తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం కడియుద్ద గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న బాణసంచా పేలుడు ప్రమాదంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో గురువారం రాత్రే ముగ్గురు మృత్యువాత పడగా కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మరో వ్యక్తి రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో శుక్రవారం మృతిచెందారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన అన్నవరం అనే వ్యక్తి సుమారు ఐదేళ్ల క్రితం కడియుద్ద గ్రామంలో బాణసంచా తయారీ పరిశ్రమకు అనుమతులు తీసుకున్నాడు. దీనికిగానూ పరిశీలన చేసిన అధికారులు 15 కిలోల వరకూ పోటాషియం దిగుమతి చేసుకునేందుకు మాత్రమే అనుమతులిచ్చారు. మొదట్లో కొంతకాలం వరకూ అనుమతి మేరకు మాత్రమే పొటాషియం దిగుమతి చేసుకుని ఇక్కడ బాణసంచా తయారు చేసేవారు. కానీ ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటుగా కర్ణాటక, తమిళనాడు, ఒడిషా వంటి రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతులు ప్రారంభం కావడంతో తయారీదారుడు నిబంధనలను తుంగలో తొక్కడం మొదలుపెట్టాడు. గురువారం ప్రమాదం జరగడానికి ముందు ఇక్కడ 24 టన్నుల కెపాసిటీ గల లారీలో పోటాషియంతో పాటుగా పేలుడుకు సంబంధించిన ఇతర సామగ్రిని కూడా దిగుమతి చేసుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. అందులో సుమారు నాలుగువేల కిలోల వరకూ పోటాషియాన్ని దిగుమతి చేసుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతమొత్తంలో దిగుమతి చేసుకోవడం వల్లే ప్రమాదం తీవ్రత ఈ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే రెండు గోదాముల్లో మందుగుండు ఉంది. ఆ గోదాములకు నిప్పంటుకుని ఉంటే ప్రమాద తీవ్రత మరింత అధికంగా ఉండేదని గ్రామాస్తులు చెబుతున్నారు.
నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
పేలుడు దుర్ఘటనలో కాకినాడ జిల్లా జగ్గంపే టకు చెందిన యాళ్ల ప్రసాద్, రొయ్యల స్వామి, నాగిరెడ్డి నాని గురువారం మతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అధిక సంఖ్యలో మృతులు ఉంటారని అంతా అనుమానించారు. వారి శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉండడంతో చూసిన వారికి గుండె తరుక్కుపోయింది. నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన రాజు తీవ్ర గాయాలపాలై రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది.
నిర్లక్ష్యమే బలిగొంది..?
అగ్ని మాపక వాహనం ఘటనా స్థలానికి చేరుకోవడానికి అవకాశం లేకపోయింది. పుంత రహదారి ఇరుకుగా ఉండడంతో వాహనం దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులే అంతిమంగా రంగంలోకి దిగారు. పక్కనే ఉన్న చెరువులో ఇంజన్‌ను ఏర్పాటు చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నికీలలు, మరోవైపు పేలుడు శబ్ధాలు వినిపిస్తుండడంతో గంట వరకు ప్రమాద స్థలానికి చేరుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఆ తర్వాతే కడియద్దతో పాటు, చుట్టు పక్కల గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహకారం అందించారు. రాత్రి 11 గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. తయారీ కేంద్రానికి అనుమతి ఇవ్వొద్దంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెడచెవిన పెట్టారంటూ కడియద్ద గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అగ్నిమాపక వాహనం వెళ్లేందుకు రహదారి లేకపోవడాన్ని గ్రామస్తులు వేలెత్తి చూపారు.
కొన్నేళ్ల క్రితం ఉంగుటూరు మండలం వెల్లమిల్లిలో ఇదే తరహాలో పేలుడు చోటు చేసుకుంది. అయినా అధికారులు పాఠాలు నేర్పలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కడియుద్దలో పరిమితికి మించి మందుగుండు నిల్వలున్నా సరే అధికారులు పట్టించుకోలేదు. దాంతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా పెంకు చిచ్చుబుడ్డిలను వినియోగించారు. తయారీ కేంద్రానికి ఎలాంటి విద్యుత్ కనెక్షన్ ఉండకూడదనే నిబంధన ఉన్నా అనధికారికంగా విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయడం విస్మయానికి గురిచేసింది. అనధికారికంగా విద్యుత్ కనెక్షన్ తీసుకుని లైట్ల వెలుతురులో రాత్రి సమయంలో కూడా ఇక్కడ మందుగుండు తయారీ చేస్తున్నారు. దానికితోడు తాటాకులతో గుడిసెలు వేసి అందులో మందుగుండు తయారీ చేయడం కొసమెరుపు.
తెలికచర్ల నుంచి కూలీలు వచ్చి ఉంటే..!
ప్రతిరోజూ నల్లజర్ల మండలం తెలికచర్ల గ్రామం నుంచి ఇక్కడ పనిచేసేందుకు 15 మంది వరకూ కూలీలు వస్తుండేవారని స్థానికులు చెబుతున్నారు. కానీ గురువారం వారు పనిచేయడానికి రాలేదని చెప్పారు. లేకుంటే పెనుప్రమాదం వాటిల్లేదని వారు చెబుతున్నారు. దీపావళికి ముందు ఈ కేంద్రంలో ప్రతిరోజూ సుమారు 400 మంది వరకూ పనిచేసేవారని, ఆ సమయంలో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే తీవ్రత ఊహాకే అందడం లేదని స్థానికులు చెబుతున్నారు.
ఫైర్ సేఫ్టీ ఎక్కడా..!
ఈ పరిశ్రమ యజమాని అన్నవరం అత్యాశే ప్రమాదానికి మూలకారణంగా కనిపిస్తోంది. ఈ పరిశ్రమలో అగ్నిమాపక శాఖకు సంబంధించిన ఎలాంటి నిబంధనలనూ పాటించడం లేదు. ప్రమాదం వాటిల్లితే మంటలను అదుపు చేయడానికి నీటిపైపులను ఏర్పాటు చేయలేదు. మంటలను అదుపుచేసే సిలిండర్లు లేవు. కనీసం ఇసుకను కూడా అందుబాటులో ఉంచలేదు. ఇవన్నీ బహిరంగంగా కనిపిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్న ఉత్ఫన్నమవుతోంది. అధికారులకు ప్రతినెలా మామూళ్లు పంపించడం వల్లే వారు చూసీచూడనట్లు వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ పంచాయతీ కార్యదర్శికి దీన్ని ఇక్కడ నుంచి తరలించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆయన పట్టించుకోలేదని, కేవలం అన్నవరం ఇచ్చే కాసులకు కక్కుర్తిపడే ఈ విధంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.
తాడేపల్లిగూడెం : కడియద్దలో మందుగుండు సామగ్రి తయారీ కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన వారికి రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని సిపిఎం తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం పార్టీ నాయకులు పరిశీలించారు. ప్రశాంతంగా ఉన్న కడియద్దలో ఇలాంటి సంఘటన జరగటం విచారకరమన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనే అధికారులు మేల్కోవడం జరుగుతుందని విమర్శించారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో జిల్లా అధికారుల నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. గతంలో ఉంగుటూరు మండలంలోని జరిగిన సంఘటనలో చనిపోయిన అనుభవాలు ఉన్నప్పటికీ అధికారులు అప్రమత్తంగా లేకపోవడం విచారకరమన్నారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న మందుగుండు తయారీ కేంద్రాలను, గొడౌన్లలో అధికారులు తనిఖీచేసి లైసెన్సు, మందుగుండు సామగ్రి నిల్వలు సామార్ధ్యానికి ఉన్న అనుమతులను పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చింతకాయల బాబూరావు, జిల్లా కమిటీ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, పట్టణ కమిటీ సభ్యులు కరెడ్ల రామకష్ణ ఉన్నారు.










