Apr 19,2023 23:50

డాక్టర్‌ ఆదిద్య

- మెడికవర్‌లో ప్రపంచ కాలేయ దినోత్సవం
ప్రజాశక్తి - కాకినాడరూరల్‌
మానవ శరీరంలోని అతి పెద్ద గ్రంథి కాలేయం మానవ శరీరానికి అత్యంత ముఖ్యమైన సంక్లిష్టమైన అవయవాలలో ఒకటని సర్జికల్‌ గాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ ఆదిత్య అన్నారు. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా బుధవారం మెడికవర్‌ హాస్పిటల్స్‌లో కాలేయ ఆరోగ్యంపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన నిర్వహించారు. శరీర అవయవాలలో కాలేయం కొంచెం భిన్నమైనదన్నారు. కాళ్లు, చీల మండలలో వాపు, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, జ్వరం, కామెర్లు, కడుపు నొప్పి, మూత్రం రంగులో మార్పు, పొట్ట చుట్టూ దురద, ఎరుపు చర్మం, మలంలో రక్తం స్రావం లక్షణాలు కనిపిస్తే కాలేయ సంబంధిత వ్యాధి బారిన పడుతున్నామని గుర్తించాలని అన్నారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు ప్రబలంగా ఉన్నట్లయితే తక్షణ వైద్యుడిని సంప్రదించాలన్నారు. .ఇండియాలో లివర్‌ పనితీరు దెబ్బతినడానికి ప్రధాన కారణం మద్యం సేవించడమేనని దీనికి అలవాటు అయిపోవడంతో రాను రాను సిర్రోసిస్‌ సమస్యకు గురవుతారన్నారని చెప్పారు.హెపటైటిస్‌ బీ, సి వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ కూడా ఈ లివర్‌ ప్రాబ్లెమ్‌ కు కారణమని 10 నుంచి 15 సంవత్సరాలకు పైగా ఈ ఇన్ఫెక్షన్స్‌తో సతమతమ య్యేవారిలో సిర్రోసిస్‌ సమస్య కనిపించవచ్చన్నారు. ముందుగానే వ్యాధి లక్షణాలను గ్రహిస్తే తద్వారా కాలేయ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. మద్యం శరీరాన్ని విపరీతంగా డీహైడ్రేట్‌ చేస్తుందన్నారు. ఆరోగ్యకరమైన ఆహారంలో ఆకు కూరలు ,పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. కమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఆయన తెలిపారు.