Aug 22,2023 22:16

విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ఎస్‌ఐ హరికృష్ణ

ప్రజాశక్తి - పాలకొండ : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (బాలురు)లో జాతీయ సేవా పథకం, నగర పోలీస్‌ ఆధ్వర్యంలో '' మీ పోలీసు గురించి తెలుసుకోండి'' అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్‌ఐ శివప్రసాద్‌ హాజరై విద్యార్థులకు పోలీసులు, వారి విధుల గురించి వివరించారు. బాధ్యత గల విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలంటే, ప్రస్తుతం క్రమశిక్షణతో విద్యను అభ్యసించి లక్ష్యం వైపు అడుగులు వేసి ఇప్పటి నుంచే భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. సమాజంలో మనకి గుర్తింపు రావాలంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులకు మీ ఊరికి పేరు తీసుకురావడానికి చదువు ఒక్కటే మీ దగ్గర ఉన్న ఆస్తి అని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా చట్టంలో ఉన్న వివిధ చట్టాల గురించి, వాటి సెక్షన్ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు, ప్రిన్సిపల్‌ పైల శంకర్రావు, సీనియర్‌ అభ్యర్థులు తేజేశ్వరరావు, నారాయణరావు, గిరిబాబు, వ్యాయామ ఆధ్యాపకులు నాగభూషణరావు పాల్గొన్నారు.
పాలకొండ రూరల్‌:స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థానిక పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో ఆజాధికా అమృత్‌ మహౌత్సవ కార్యక్రమంలో భాగంగా పాలకొండ పోలీసు శాఖ వారు నో యువర్‌ పోలీస్‌ కార్యక్రమాన్ని కళాశాలలో జరిగే స్టూడెంట్‌ ఇండక్షన్‌ ప్రోగ్రాం ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై బి.శివప్రసాద్‌ పోలీసు శాఖ గురించి తెలుసుకో అన్న అంశంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.శ్యాంబాబు, వైస్‌ ప్రిన్సిపల్‌ బి.జయమణి, కోఆర్డినేటర్‌ బి రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : కళాశాల స్థాయి నుంచి విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఎల్విన్‌పేట ఎస్‌ఐ ఎస్‌.షణ్ముఖరావు అన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలుర జూనియర్‌ కళాశాలలో మంగళవారం అజాది కా అమృత్‌ మహౌత్సవ కార్యక్రమంలో భాగంగా పోలీస్‌, న్యాయ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసుల విధులను విద్యార్థులకు వివరించి అనంతరం చట్టాలు, పోలీసుల విధులపై విద్యార్థులతో చర్చించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ యుగంధర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ ఎన్‌.అచ్చెన్నాయుడు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.