Sep 24,2023 21:51

మాట్లాడుతున్న సాహితీవేత్త అప్పలనాయుడు

ప్రజాశక్తి- రాజాం : మారుతున్న కాలానికి పరిస్థితులను అన్వయం చేస్తూ సిద్ధాంతాలను సమీక్షిస్తూ మార్పు చెందాలని ప్రముఖ సాహితీవేత్త అట్టాడ అప్పల నాయుడ అన్నారు. భారత సమాజంలో భూస్వామ్య వ్యవస్థ అంతరించి పోయిందని, రైతు, కూలీల మధ్య భేదం తరిగి పోతోందని, ఇలాంటి మారుతున్న పరిస్థితులను బట్టి సామాజిక ఆర్థిక సూత్రాలను పునస్సమీక్ష చేసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం రాజాం రచయితల వేదిక 104వ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ డి. రమేష్‌ పట్నాయక్‌ రచించిన గతి తార్కిక భౌతిక వాదం పరిచయం, డేవిడ్‌ హార్వే -పెట్టుబడి, ఏడు ప్రాథమిక వైరుధ్యాలు పరిచయం, ఇతర వ్యాసాలు అనే రెండు గ్రంథాలను అట్టాడ ఆవిష్కరించారు. సమాజం భావవాదాన్ని వదిలి, భౌతిక వాదాన్ని అనుసరించినప్పుడే అభ్యుదయ పథంలో నడుస్తుందని తెలిపారు. శ్రామిక వర్గాలు మార్క్స్‌ సూత్రాలను అవగాహన చేసుకున్నప్పుడే అభ్యుదయాన్ని సాధిస్తాయని అన్నారు. వేదిక నిర్వాహకుడు గార రంగనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు, రమేష్‌ పట్నాయక్‌తో పాటు రౌతు గణపతి రావు నాయుడు, అంబల్ల రామ్మూర్తి, పిల్లా తిరుపతి రావు, సమతం మహేశ్వరరావు, ఆల్తి మోహన్‌రావు, డి. కిషోర్‌, వెలుగు రామానాయుడు, పొదిలాపు శ్రీనివాసరావు, పడాల కవీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.