ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అప్పారావు అని అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్వర్ణ చిన రామిరెడ్డి అన్నారు. మహిళ కన్నీటి గాధలకు ఆర్థిక స్వాతంత్రం లేకపోవడమేనని గ్రహించిన ఆయన పీడిత కులాల జీవితాల్లోనూ ఆ సమస్యకున్న ప్రాధాన్యాన్ని గమనించారని, ఆర్థిక స్వావలంబనకు ఆధునిక విద్యను అందజేసి చైతన్యం నింపారని చెప్పారు. నరసరావుపేటలోని శాఖా గ్రంధాలయంలో గురువారం గురజాడ అప్పారావు జయంతి సభను శ్రీనాధ సాహితీ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురజాడ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాల గురించి ఉత్తమైన ఆలోచనలో ఉన్న గురజాడ ప్రజలను విద్యకు దూరం చేసే బాషా వ్యాకరణ నియమాల స్థానంలో సరళమైన భాషా ప్రయోగాలను అమలుకు కృషి చేశారని కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరైన గురజాడ హేతువాది అన్నారు. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలో గురజాడ రచనలు నేటికి ప్రజల మన్ననలను పొందుతున్నాయన్నారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారని, కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పారు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన గురజాడ తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసి కవి శేఖర అనే బిరుదు అందుకున్నారన్నారు. కార్యక్రమములో విద్యార్థిని, విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కాలానికి ముందు నడచిన క్రాంతదర్శి గురజాడ అని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెల్లమూడి తెలుగు అధ్యాపకులు పి.మధుసూదనరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మధుసూదన్ మాట్లాడుతూ ఆధునిక సాహిత్య విప్లవ వైతాళికుడు గురజాడల జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బాల్యవివాహాలను నిరసిస్తూ సంచలన తిరుగుబాటుకు కలం కదిపారన్నారు. దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషులోరు, సొంత లాభం కొంత మానుకో పొరుగువారికి పాటుపడవోరు అని మార్క్సిస్టు దక్పథాన్ని తన సాహిత్యంలో చూపించారన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.హనుమంతయ్య మాట్లాడుతూ సాంఘిక దురాచా రాలను సాహిత్యంలో దునుమాడి, సంఘ సంస్కరణ సాహిత్యం సృష్టించిన నవయుగ సాహిత్య వైతాళికుడు గురజాడ అని, ప్రతి కవితా సామాజిక స్పృహతో రాశారని కొనియాడారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ కాకాని సుధాకర్, అతిథి అధ్యాపకులు పి.సునీల్ విద్యార్థులు పాల్గొన్నారు.










