Dec 30,2022 00:05

మాట్లాడుతున్నవిఒఎల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అనకాపల్లి విలేకరి
విఒఎ మెడపై కత్తిలా వేలాడుతున్న సర్య్కులర్‌ 64/11 రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేయాలని విఒఎ ఉద్యోగుల సంఘం రాష్ట్ర 4వ మహాసభ డిమాండ్‌ చేసింది. సర్క్యులర్‌ రద్దయ్యే వరకు పోరాటం కొనసాగించాలని మహాసభ తీర్మానించింది. 40 ఏళ్లు దాటకూడదని, పదో తరతగతి విద్యార్హత ఉండాలని, పురుషులు ఉండకూడదన్న ఆంక్షలు ఎత్తివేసి, సర్య్కులర్‌ 64 రద్దు చేయాలని, విఒఎ, ఆర్‌పిల పనులను వాలంటీర్లకు అప్పగించే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ధనలక్ష్మి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనకాపల్లిలోని గవరపాలెంలో బి.రాంబాబు ప్రాంగణం, వి.రత్నంనగర్‌ (వివి రమణ రైతు భారతి కల్యాణ వేదిక)లో ఎపి వెలుగు విఒఎ (యానిమేటర్స్‌) ఉద్యోగుల సంఘం (సిఐటియు) రాష్ట్ర నాలుగో మహాసభ తొలిరోజైన గురువారం ఉత్సాహంగా ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి 250 మంది ప్రతినిధులు మహాసభకు హాజరయ్యారు. బి.రాంబాబు, వి.రత్నం, మల్లు స్వరాజ్యం, ఆర్‌.రాజ్యలక్ష్మి చిత్రపటాలకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతినిధుల సభలో సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ధనలక్ష్మి కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. ఈ సభలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.రూపావతి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.లోకనాథం, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శంకరరావు, జి.కోటేశ్వరరావు, విఒఎల సంఘం అనకాపల్లి జిల్లా గౌరవాధ్యక్షుడు వివి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు కె.సూరిబాబు, రాష్ట్ర కోశాధికారి తిరుపతయ్య, ఎపి గొర్రెలు,మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్‌, ఎపి కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్‌.అరుణ, అల్లూరి సీతారామరాజు జిల్లా విఒఎ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భాను, అన్నమయ్య జిల్లా సంఘం అధ్యక్షుడు రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.