ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సంఘం ఆదేశాలతో కాకినాడ జిల్లాలో సమగ్ర ఓటు సర్వే సరవేగంగా సాగింది. అనుకున్న సమయానికి తుది ఓట్లర జాబితా ప్రక్రియ సిద్ధం కావాలన్న అధికారుల ఆదేశాలతో కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు 60 వేలకు పైగా ఓట్లును అధికారులు తొలగించారు. ఓట్ల తొలగింపులో కాకినాడ అర్బన్ నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. కాకినాడ అర్బన్ నియోజకవర్గంలోనే సుమారు 24 వేలకు పైగా ఓట్లు తొలగించినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన కాకినాడ నియోజకవర్గం ఓట్లు తొలగింపులోనూ మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. అటు రెవెన్యూ, ఇటు కార్పొరేషన్ అధికారులు కలిపి ఇప్పటి వరకూ తొలగించిన 24 వేల ఓట్లకుపైగా తొలగించిన ఓట్లులో తమ ఓటు ఉన్నట్టా..? లేనట్టా..? అని పలువురు ఓటర్లు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలోనే 24 వేల ఓట్లు తొలగించడం వెనుక ఆంతర్యం ఏమిటో అన్నది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.
200 పోలింగ్ బూతుల్లో కొనసాగిన ప్రక్రియ
కాకినాడ నియోజకవర్గంలో 1,80,000 పైగా ఓట్లరు ఉండగా, సుమారు నాలుగు లక్షల పైగా జనాభా ఉన్నారు. గతంలో 48 వార్డులతో ఉన్న నగరం 50 వార్డులకు పెరిగింది. అయితే నగర పాలక సంస్థ ఎన్నికల్లో 48 వార్డులకే ఎన్నికలు నిర్వహించారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తుది వాటర్ల జాబితా సిద్ధం చేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఈ ప్రక్రియను చేపట్టేందుకు 2022 నుంచే ప్రణాళిక సిద్ధం చేశారు. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి మూడు నెలల పాటు, 2023లో జూన్ నెల నుంచి మొదలైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 200 బూత్ లెవెల్ పరిధిలో సుమారు 25 వేలకు పైగా ఓట్లు తొలగించారు.
ఈ విధంగా తొలగించారట..!
కాకినాడ నగరం ఎంతోమందికి నివాసయోగ్యంగా మారింది. పలు ప్రాంతాల నుంచి ఇక్కడ స్థిరపడినవారు, ఎన్నో సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్న వారు, ఓకేడోర్ నెంబర్‌పై ఓటర్లు జాబితాలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం చేపట్టిన ఓటర్ల సమగ్ర సర్వేలో ఇల్లు మారినా, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినా, మృతి చెందినా, వివాహం జరిగిన వారిని గుర్తించి ఆయా విభాగాల వారీగా అధికారులు ఓట్లును తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఇక్కడ విశేషమేమంటే ఒకే ప్రాంతంలో ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారిన ఓటర్లను తొలగించడం చర్చానీయాంశంగా మారింది. ఉదాహరణకు జగన్నాధపురంలోని రామారావు పేట ప్రాంతానికి చెందిన ఒక ఇంటిలో ఉన్న ఓటరు అదే ప్రాంతంలో పది ఇల్లులు దాటిన తరువాత ఇంటిలోకి మారాడు. ఇదే అదునుగా భావించిన అధికార యంత్రాంగం ఇల్లు మారిన కారణాన్ని చూపి ఆ ఓటర్‌ను జాబితా నుంచి తొలగించారు. అలాగే ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లిన ఓటర్‌ను సైతం తొలగించడం ఇక్కడ విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో జగన్నాధపురంలోనే ఎక్కువ ఓట్లు తొలగించారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఒక్క జగన్నాధపురంపైన ఎందుకు ప్రత్యేక దష్టి సారించి ఓట్లను తొలగించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఇళ్లు మారిన ఓటర్లను తొలగించడం, వారిని మరోసారి ఓటు హక్కు కల్పించమని దరఖాస్తు చేసుకోమనడం వంటి ప్రక్రియను చేపట్టడం ఓటర్లను అయోమయంలోకి నెట్టడమే సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తొలగించిన 24 వేలకుపైగా ఓటర్లలో ఎవరు ఉన్నారు..? ఎవరి ఓటు తొలగిపోయిందనేది తెలుసుకోవాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే.










