Jun 22,2023 23:04

ప్రజాశక్తి-కాకినాడ కాకినాడలో రూ.129.25 కోట్ల భారీ భూ మాయకు కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ చంద్రశేఖర రెడ్డి తెరలేపినట్టు మాజీ ఎంఎల్‌ఎ వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. కలెక్టర్‌ కతికా శుక్లాకు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో సుమారు ఆరెకరాల్లో సురేష్‌ నగర్‌ మున్సిపల్‌ పార్క్‌ సముదాయం ఉందన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ పార్క్‌ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు గత ప్రభుత్వాలు వివిధ దశలలో పార్కును అభివద్ధి చేశాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా మూడేళ్లుగా కొనసాగుతున్న పనులను కాంట్రాక్టర్లు నిలిపివేశారని కొండబాబు తెలిపారు. సర్వే నెంబర్‌ 212/సిలో 1.93 ఎకరాల భూమి తమకు చెందుతుందని కొంతమంది ప్రైవేట్‌ వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ప్రస్తుతం విషయం హైకోర్ట్‌లో ఉందన్నారు. 2022 మార్చి 19న కాకినాడ కార్పొరేషన్‌ సమావేశంలో ఆఘమేఘాలపై ఆ స్థలానికి టిడిఆర్‌ బాండ్స్‌ జారీ చేయాలనీ కౌన్సిల్లో ప్రవేశపెట్టి పాలకమండలితో ఎంఎల్‌ఎ ద్వారంపూడి ఆమోదింప చేశారని చెప్పారు. రెసిడెన్షియల్‌ భూమిని వాణిజ్యంగా మార్పు చేసి చదరపు గజం విలువ రూ.36 వేలు చేసి 129.25 కోట్లు టిడిఆర్‌ బాండ్ల రూపంలో ఎంఎల్‌ఎ ద్వారంపూడి దోచుకుంటున్నట్టు చెప్పారు. ఈ టిడిఎస్‌ బాండ్లను మార్పు చేసేందుకు ఒక ఎంపీ సహకరించారన్నారు. ఈ భూ మాయకు సంబంధించి గురువారం కలెక్టర్‌ను కలిసి టిడిఆర్‌ బాండ్ల మంజూరుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి తగిన పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. తగిన చర్యలు తీసుకోని పక్షంలో తమ పార్టీ తరపున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, పలివెల రవికుమార్‌, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్‌, శీకోటి అప్పలకొండ, ఒమ్మి బాలాజీ, ఎండి ఆన్సర్‌, ఎస్‌కె.రహీమ్‌, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్నా, గాది శివ, వానపల్లి పోలీస్‌, పంతాడి రాజు తదితరులు పాల్గొన్నారు.