Jun 11,2023 22:54

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ భానుడు భగ్గుమన్నాడు. ఆదివారం జిల్లాలోని అన్ని మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే మొదలైన ఎండ సాయంత్రం 5 గంటల వరకు అదేస్థాయిలో కొనసాగడంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోయారు. పగటిపూట ఇళ్ల నుంచి బయటకు రావా లంటే జనం జంకుతున్నారు. ఎండల తీవ్రత మరికొన్ని రోజులపాటు కొన సాగనుందని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. కాకినాడ జిల్లాలో శనివారం అత్యధికంగా కాకినాడ 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా రౌతలపూడి 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాకినాడ రూరల్‌ 43.6, పిఠాపురం 43.6, సామర్లకోట 42.5, పెద్దాపురం 43.3, గొల్లప్రోలు 43.7, సెంకవరం 41.2, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ లో రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ ఎండ దాటికి నిర్మానుష్యంగా మారాయి. ఒకపక్క ఎండ తాకిడి, ఉక్క పోత ఎదుర్కొంటున్న ప్రజలకు అధిక స్థాయిలో కరెంటు కోతలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కరెంటు కోతలతో ముఖ్యంగా చిన్నారులు, వద్ధులు అల్లాడిపోతున్నారు. వ్యాపారాలు ఉదయం 11 గంటలకే షాపులు మూసివేసి సాయంత్రం చల్లబడ్డాక షాపులు తెరుస్తున్నారు.