ప్రజాశక్తి-కాకినాడ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బుధవారం ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు కంటెస్ట్ విజేతలకు అవార్డుల ప్రదానం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్, కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి డాక్టర్ కృతికా శుక్లా, కమిషనర్ సిహెచ్.నాగనరసింహారావు, మునిసిపల్ వైద్య అధికారి డాక్టర్ పృథ్వీచరణ్‌తో కలిసి అవార్డు అందుకున్నారు. స్మార్ట్ సిటీల పోటీల్లో పారిశుధ్యం కేటగిరీలో ఘన వ్యర్థాల నిర్వహణ విభాగంలో దేశంలోనే రెండోస్థానంలో కాకినాడ స్మార్ట్ సిటీ నిలవడంతో ఈ అవార్డు లభించింది. బుధవారం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ప్రజల జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో స్మార్ట్ సిటీల్లో చేపడుతున్న వినూత్న, సుస్థిర, సమ్మిళిత, సురక్షిత ఆరోగ్య కార్యక్రమాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు అందజేస్తోందని, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో కాకినాడ స్మార్ట్ సిటీకి అవార్డు లభించినందుకు చాలా ఆనందంగా ఉందని కలెక్టర్ కృతికా శుక్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు. అవార్డు రావడంలో కీలకపాత్ర పోషించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్మార్ట్ సిటీ అధికారులకు, సిబ్బందికి, పారిశుధ్య సిబ్బందికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్వచ్ఛాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో కాకినాడను స్వచ్ఛతలో ముందు నిలిపేందుకు కషిచేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ ఇఇ మాధవి పాల్గొన్నారు.










