Aug 20,2023 00:41

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరంగా పేరొందిన కాకినాడను ముంపు సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఏటా వరదల సమయాల్లో 20 డివిజన్ల వరకు ముంపులోనే కొనసాగుతుండడం వల్ల ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. సెప్టెంబరు మొదటి వారంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో మరోసారి ముంపు ముప్పు పొంచి ఉందని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణల చెరలో ప్రధాన డ్రెయిన్లు
కాకినాడ నగరంలో సుమారు 5 లక్షల మంది జనాభా నివశిస్తున్నారు. 50 డివిజన్లు ఉండగా ప్రతి సంవత్సరం పాత బస్టాండ్‌, కచేరి పేట, ట్రెజరీ కాలనీ, టీచర్స్‌ కాలనీ, ప్రేజరుపేట తదితర 20 డివిజన్లను ముంపు సమస్య బాధిస్తోంది.ఉప్పుటేరు కాలువలో ఎక్కడికక్కడ అడ్డుకట్లు వేయడం దీనికి కారణం. రెండేళ్లుగా ఇంద్రపాలెం లాకుల వద్ద మేడలైన్‌ భూముల కోసం అనధికారికంగా వంతెన నిర్మిస్తున్నారు. ఈ పనుల కోసం కొందరు ఉప్పుటేరు కాలువను మట్టితో పూడ్చివేశారు. పలు చోట్ల ఆక్రమణలున్నాయి. కొన్ని చోట్ల అవుట్‌లెట్లు మూసుకుపోయి ఉన్నాయి. పోర్టు రైల్వేస్టేషన్‌, సర్వారాయ టెక్స్‌ టైల్స్‌, దుమ్ములపేట, రామకష్ణారావుపేట, జగన్నాథపురం, చీడిలపొర మేజరు డ్రెయిన్లకు చెందిన అవుట్‌ లెట్లు ఎక్కువగా మూసుకుపోయాయి. ఎస్‌.అచ్యుతాపురంలో జనచైతన్య లే అవుట్‌ నుంచి భారీ కాలువలో వ్యర్థాలు ఉప్పుటేరులో కలుస్తున్నాయి. బ్రహ్మంగారి మఠం వద్ద ఉప్పుటేరుపై ఆక్రమణలు ఉన్నాయి. నగరంలోని కాలువల ద్వారా రోజూ 20 లక్షల ఎంఎల్‌డి వ్యర్థ జలాలు ఇందులోనే కలుస్తాయి. మామూలు రోజుల్లో ఇబ్బంది లేకపోయినా, వర్షాలు, వరదలు వస్తే ముంపు సమస్య మరింత తీవ్ర మవుతుంది. సామర్లకోట వైపు నుంచి వస్తున్న కాలువతో పాటు అదే రోడ్డులో ఎడమ వైపు ఉన్న మరో ఏలేరు సాగునీటి డ్రెయిన్‌ ద్వారా వస్తున్న నీరు ఉప్పుటేరులో కలిసి అక్కడ నుంచి సముద్రంలోకి చేరుతుంది. ఏలేరు, సామర్లకోట ప్రధాన కాలవ గుండా పెద్ద ఎత్తున ఆక్రమణలు ఉన్నాయి. దారిపొడవునా కాలువలో కొంత భాగాన్ని ఆక్రమించి పలువురు పూల తోటలు పెంచుతున్నారు. శాశ్వత భవనాలు నిర్మించారు. ఇంద్రపాలెం సుబ్రహ్మణ్యం గుడి వద్ద ప్రధాన కాలువ ఆక్రమణకు గురైంది. దానికి తోడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ స్వలాభాల కోసం కాలువపై తూరలు వేసి ప్రవాహానికి అడ్డుకట్టు వేస్తున్నారు. ప్రతాప్‌ నగర్‌ రైల్వే గేటు వద్ద ఇన్‌కంటాక్స్‌ కాలనీ వద్ద వేసిన తూరలు కూరుకుపోయి వరదనీటి ప్రవాహాన్ని అడ్డు కుంటున్నాయి. దీంతో పాటుగా పెద్ద ఎత్తున గుర్రపు డెక్క పేరుకుపోయింది. దాదాపు 20 కిలోమీటర్ల పొడవున సామర్లకోట నుంచి వచ్చే గోదావరి కాలువ, ఏలేరు ద్వారా సాగయ్యే పొల్లాల్లోని వ్యర్థాలు, కొవ్వూరు నుంచి వచ్చే కాలువలోని వ్యర్థాలు ఉప్పుటేరులోనే కలుస్తున్నాయి.