Jul 11,2023 22:20

పర్యటిస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

ప్రజాశక్తి - పొదలకూరు :కోర్టు దొంగకు వ్యవసాయ శాఖ అప్పగిస్తే రైతులకు, ప్రజలకు మేలు చేయకుండా అనతికాలంలోనే రూ.3వేల కోట్లను దోచేసి మంత్రి కాకాణి ఎంబర్‌ 1 స్థానంలో ఉన్నారని టీడీపీ జాతీయ పోలిట్‌ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు రోడ్డు అంబేద్కర్‌ భవనం నుంచి పట్టణంలోని గేట్‌ సెంటర్‌ వరకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర 2వేల కిలోమీటర్లు పూర్తైన సందర్భంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలతో సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఒకటిన్నర కిలోమీటర్‌ పొడవున సాగిన ఈ పాదయాత్రకు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, శాలువా, గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా గేట్‌ సెంటర్లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ యువగళం నారా లోకేష్‌ ముత్తుకూరు బహిరంగ సభ చరిత్రలో నిలిచి పోతుందన్నారు. 45 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా ఒక స్టార్‌ హీరో పాదయాత్రలా జనం మధ్య జనం కోసం లోకేష్‌ పాదయాత్ర నడుస్తుందన్నారు. సీఎం జగన్‌ పాదయత్రలో సోమవారం నుంచి గురువారం వరకు 44కిలోమీటర్లు నడిస్తే నాలుగు రోజుల్లోనే లోకేష్‌ 100కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రశాంతమైన నెల్లూరు జిల్లా దుర్మార్గాలకు నెలవుగా మారిందన్నారు. రైతులకు మేలు చేస్తారని మంత్రి కాకాణికి వ్యవసాయ శాఖ అప్పగిస్త మట్టి, ఇసుక, మద్యం, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి వేల కోట్లు దోచేస్తున్నారన్నారు. తన వ్యవసాయ శాఖకు అనుబంధమైన ఆగ్రోస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ స్వయంగా నాశిరకం పనిముట్లు పంపిణీ చేస్తున్నట్లు సీఎంకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. గూగుల్లో కోర్టు థెఫ్ట్‌ అని టైప్‌ చేస్తే మంత్రి కాకాణి కోర్టు దొంగతనం బయటకు వస్తుందన్నారు. తమ హయాంలో ఇచ్చిన అసైన్మెంట్‌ భూములను రద్దు చేసి నిబంధనలకు విరుద్ధంగా కొందరికి అసైన్మెంట్‌ భూములను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రూ.70 కోట్లను కండలేరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేస్తే రూ.కోటి కరెంటు బిల్లులు కట్టలేక నిమ్మచెట్లు ఎండిపోతున్నా నీళ్లు వదలడంలేదన్నారు. నాలుగు సంవత్సరాల రెండు నెలల కాలంలో మంత్రి ఏదు చేశాడో చెప్పాలన్నారు. మెగా వాటర్‌ ప్లాంటు, డేగపూడి బండిపల్లి కాలువను తమ స్వార్థం కోసం ఆపేశారన్నారు. అనికేపల్లి, ఈదగాలి, తోడేరు చెరువుల్లో పెద్ద ఎత్తున మట్టి కోసం గుంటలు తవ్వి యువకుల ప్రాణాలను పొట్టన పెట్టుక కున్నారన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులను తన నియోజకవర్గంలో మంత్రి కాకాణి అనుచరులుగా వాడుకుంటున్నారన్నారు.