ప్రజాశక్తి-పంగులూరు: మండలంలోని నూజిల్లపల్లి గ్రామంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు పాల్పడు తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరు తూ, ఆ గ్రామానికి చెందిన యువకుడు గొట్టి పాటి కాజాస్వామి చేపట్టిన నిరాహార దీక్షను, పోలీసులు మంగళవారం భగం చేశారు. కాజాస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసు లు, రేణింగవరం పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడ కూడా తన నిరసన తెలియజేస్తుండగా, నాటకీయ పరిణామాల మధ్య అద్దంకి రూరల్ సీఐ రంగప్రవేశంతో కాజాస్వామి నిరాహార దీక్షకు తెరపడింది. సిఐ ఇచ్చిన హామీతో కాజా స్వామి దీక్ష విరమించుకుని ఇంటికి బయలు దేరాడు. నూజిల్లపల్లి గ్రామంలో సొసైటీ, డ్వాక్రా గ్రూపులు, పంచాయతీలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి సోమవారం నాడు పంగులూరులో కాజాస్వామి నిరాహార దీక్ష చేపట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. రెండో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకల్లా రేణింగవరం పోలీసులు, కాజాస్వామి దీక్ష చేపట్టిన వేణుగోపాల స్వామి దేవాలయం పక్కనున్న ఆడిటోరియం దగ్గరకు చేరుకున్నారు. పోలీసు అధికారుల ఆదేశాల మేరకు, కాజాస్వామిని బలవంతంగా ఎత్తుకొని వచ్చి పోలీస్ కారు ఎక్కించారు. ఇందుకు కాజాస్వామి నిరాకరించినా, బలవంతంగా రేణింగవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా కాజాస్వామి ఏమీ తినకుండా తన నిరసనను కొనసాగించడంతో అద్దంకి రూరల్ ఇన్‌ఛార్జి సీఐ రోశయ్య వచ్చి, గ్రామంలోని సొసైటీ, పంచాయతీ, డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన అవినీతి అక్రమాలను గురించి చర్యలు తీసుకొని దోషులను శిక్షిస్తామని, పది రోజులలో సమస్య పరిష్కరిస్తానని, కాజాస్వామికి హామీ ఇవ్వడంతో అందుకు సమ్మతించిన కాజాస్వామి తన దీక్షను విరమించుకొని నూజిల్లపల్లి చేరుకున్నారు. కాజాస్వామి దీక్ష చేపట్టిన రెండో రోజుకు పోలీసులు రంగ ప్రవేశం చేయటం, దీక్షన విరమింపచేయటం చర్చనీయాంశాలయ్యాయి.










