May 13,2023 23:48

సత్తెనపల్లి - రాజుపాలెం మధ్య పేరేచర్ల-కొండమోడు రహదారి

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల విస్తరణ పనులు పదేళ్లుగా కాగితాల్లోనే కునారిల్లుతున్నాయి. పేరేచర్ల-కొండమోడు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కోసం 2013లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు చేశారు. ఆ తరువాత టిడిపి ప్రభుత్వ హయాంలో భూ సేకరణ ప్రక్రియ చేపట్టినా ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అయినా 2018 నవంబరు 26న అప్పటి సిఎం చంద్రబాబు నాయుడు రూ.780కోట్ల అంచనాలతో నాలుగులైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంతమొత్తం నిధులు ప్రభుత్వం భరించలేదని బివోటి పద్ధతిన టోల్‌ ఫీజు వసూలు చేసుకునేలా కాంట్రాక్టర్లుకు పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ పద్ధతిలోనే గతంలో పలు మార్లు టెండర్లు పిలిచారు. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వమే ఆర్‌అండ్‌బి శాఖ ద్వారా నిర్మాణం చేపట్టేలా అంచనాలు తయారు చేసి అప్పటి సిఎం చంద్రబాబుతో శంకుస్థాపన చేశారు. కానీ ఆతరువాత మళ్లీ పాత విధానంలోనే బివోటి పద్ధతిలో టోల్‌పీజు వసూలుకు అనుమతిస్తూ టెండర్లు పిలవగా ఇప్పటి వరకూ ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఈ పనులు కాగితాలకే పరిమితమయ్యాయి.
ఆ తరువాత అధికారంలోకి వైసిపి ప్రభుత్వం ఈరహదారిని జాతీయ రహదారుల పరిధిలోకి తీసుకెళ్లేందుకు ప్రతిపాదించింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఈ రహదారిని 2020లో స్వీకరించింది. కానీ ఇంత వరకు రహదారి విస్తరణ పనులు ప్రారంభం కాలేదు. విస్తరణ పనుల చేపట్టేందుకు జాతీయ రహదారుల సంస్థకు కేంద్రప్రభుత్వం అనుమతిచ్చినా భూ సేకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండటం వల్ల పనులు చేపట్టలేదని అధికారులు చెబుతున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్‌, మాచర్ల తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు పేరేచర్ల, కొండమోడు మధ్య ఉన్న ఇరుకురహదారి వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కానీ పదేళ్లుగా ఏళ్లుగా ప్రజల ఇబ్బందిని చూస్తున్నా ప్రభుత్వం సీరియస్‌గా పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి.
గుంటూరు నగరంలో మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మూడో దశ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గుంటూరు ఆటో నగర్‌ నుంచి నల్లపాడు-చిలకలూరిపేట జాతీయ రహదారికి అనుసంధానం చేసే నాలుగు లైన్ల రహదారి మూడో దశ పనులు పదేళ్లుగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆటోనగర్‌ నుంచి జెకెసి కళాశాల వరకు రెండు దశల పనులను 2013లో అప్పటి ప్రభుత్వం పూర్తి చేసింది. అప్పటి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రహదారికి ప్రారంభోత్సవం చేశారు. అడవితక్కెళ్లపాడు నుంచి పలకలూరు వరకూ చేపట్టాల్సిన మూడోదశ పనులపై పదేళ్లుగా అదిగో..ఇదిగో అని అధికారులు పలుమార్లు అంచనాలు రూపొందించినా ఇప్పటి వరకూ చేపట్టలేదు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే కూడా ఎనిమిదేళ్లుగా కార్యరూపం దాల్చలేదు. పలుమార్లు ఎలైన్‌మెంట్స్‌ మార్చినా కొలిక్కిరాలేదు.
గుంటూరు జిల్లాలో పెరిగిన ట్రాఫిక్‌ దృష్ట్యా ప్రధాన రహదారుల విస్తరణ పనులు కూడా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. గుంటూరు-తెనాలి, గుంటూరు-రేపల్లె వయా పొన్నూరు, గుంటూరు-పర్చూరు, సత్తెనపల్లి-అమరావతి, రేపల్లె-తెనాలి తదితర రహదారులను విస్తరించాలని ప్రతిపాదించారు. సింగిల్‌ రోడ్డును డబల్‌ రోడ్డుగా, డబల్‌ రోడ్డును 10 మీటర్ల రోడ్డుగా, ప్రధాన రహదారులను రెండు వరసల రహదారిగా విస్తరించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఈ మేరకు జిల్లాలో దాదాపు 500 కిలో మీటర్ల మేరకు రహదారుల విస్తరణకు ప్రతిపాదనలు చేయగా ఇందుకు సంబంధించి నిధులు రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడం వల్ల కొత్తపనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.