Mar 19,2023 00:00

కాగడాలతో నినాదాలు చేస్తున్న ఆదివాసీలు

ప్రజాశక్తి-రోలుగుంట: విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండ శిఖర గ్రామమైన నీలిబంద ఆదివాసి గిరిజన గ్రామస్తులు కాగడాలతో వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. గోవిందరావు, మండల కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి, గ్రామస్తులు మాట్లాడుతూ, చీకటి పడితే అంధకారం నెలకొంటుందని, దట్టమైన అడవి మధ్యలో తమ గ్రామం ఉందన్నారు. క్రూర మృగాల మధ్య జీవనం సాగిస్తున్నామని, నేటికీ తమ గ్రామానికి కరెంటు సౌకర్యం లేదన్నారు. ఎప్పుడు తెల్లవారుతుందోనని బిక్కుబిక్కుమంటూ రాత్రి సమయంలో బతుకుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా కరెంట్‌ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నీరు కోసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకున్న పరిస్థితి నెలకొందన్నారు. అనారోగ్యం వస్తే డోలీలతో ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు స్పందించి తమ గ్రామానికి కరెంట్‌, మంచినీరు, ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొర్ర లక్ష్మణరావు, గెమ్మెల చిన్న, గెమ్మెల చిలకమ్మ పాల్గొన్నారు.