Jan 10,2021 08:11

      'ఒరే రంగా ! వ్యవసాయానికి భూమెంత ముఖ్యమో, ఎద్దూ అంతే ముఖ్యం. నువ్వు పడేసే నాలుగు గడ్డిపరకలు తిని, నువ్వు పోసే కుడితినీళ్లు తాగి చచ్చేదాకా నీ పొలంలో ఒక మనిషిగా నీతోపాటు సేవచేసి, నీ ఆదాయానికి ఆసరాగా ఉండే ఎద్దులంటే మనకు దైవంతో సమానం. వయసు పెరిగిందనో, పని చేయలేక పోతుందనో, ఓపిక తగ్గిందనో దాన్ని కబేళాకు అమ్మకుండా, చచ్చిన తర్వాత మనిషికి చేసినట్లే మట్టిలో పూడ్చి, దాని రుణం తీర్చుకో. మట్టికీ మనిషికీ ఉండే రుణానుబంధం ఎంత బలీయంగా ఉంటుందో, వ్యవసాయం చేసే రైతుకీ కాడిమోసే ఎద్దుకీ అంతే అనుబంధం ఉందని మర్చిపోకు. ఏదో నాలుగుడబ్బులకు ఆశపడి దాన్ని కబేళాకు పంపుతావేమో ! అలా అమ్మగా వచ్చిన డబ్బులతో నువ్వు జీవితాంతం కూర్చుని తినలేకపోవచ్చు. కానీ దాన్ని అమ్మేశాననే అపరాధభావం నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది' అని బతికున్నప్పుడు తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రంగనాథానికి. చిన్నగా నవ్వుకుని ఎద్దులవంక మురిపెంగా చూసుకున్నాడు. నిజమే... నాలుగు గడ్డిపరకలేస్తే ఎద్దులు ఎంతో కృతజ్ఞత చూపిస్తాయి. అరక దున్నినా, మెరక సరిచేసినా ఎద్దులు చేసే సాయం మర్చిపోలేనిది. తాతల నుండి తండ్రులకూ తండ్రుల నుండి కొడుకులకూ ఆస్తులు వారసత్వంగా రాకపోయినా వ్యవసాయానికి ఎద్దుల వాడకం మాత్రం ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. పొలం పనులకు అనుకూలంగా ఉంటుందని ఎద్దుల కాళ్లకు గిట్టలు కొట్టించేటప్పుడు ఎద్దుల కంటే తన ప్రాణమే గిలగిల్లాడింది. అడుగు కిందపెడితే ఎద్దుల కాళ్లకు ఎక్కడ నొప్పి కలుగుతుందోనని అస్తమానం ఎద్దుల కాళ్లవంక చూస్తున్న తనను వారిస్తూ 'ఒరే రంగా! వాటికేమీ కాదులేరా? మనిషికి చెప్పులెలాగో ఎద్దులకు గిట్టలలాగే' అంటున్న తండ్రిని చూసి ఊరట చెందడం తనకింకా గుర్తు.
      ముసురు పట్టినప్పుడు కురిసే వాన చినుకుల్లా తెరిపి లేకుండా వస్తున్న ఆలోచనలను పక్కనపెట్టి, ఎద్దుల్ని ఆప్యాయంగా తడిమాడు రంగనాథం. జన్మజన్మలుగా పెనవేసుకున్న అనుబంధమేదో కళ్లను ఒక్కక్షణం తడిచేసింది. ఎద్దుల కొమ్ముల్ని, చెవుల్ని, మెడ కింద అణువణువూ తడిమిచూసి, పులకించిపోయాడు. అందంగా, ఎత్తుగా కనిపిస్తున్న మూపురాన్ని ముద్దుపెట్టుకున్నాడు. చిన్నపిల్లాడిలా మారిపోయి, మెళ్ళో కట్టిన గంటను అటూఇటూ ఊపి మోగించాడు. గంట మోగినప్పుడు శరీరాన్ని కదిలించిన ఎద్దు వంక ఆప్యాయంగా చూశాడు. వెనుక రెండు కాళ్లను కదిలిస్తూ తోక ఊపిన ఎద్దును చూసి, వీపు మీద చరిచాడు రంగనాథం. ఆ స్పర్శతో ఎద్దు నిలువెల్లా కదిలిపోయింది.
      అటూఇటూ మెడ ఊపుతూ, కాళ్లు ఊపుతూ ఆనందించసాగింది. ఒకచేత్తో దాని వీపు మీద చరుస్తూ, మరో చేత్తో దాని నోటికి గడ్డిపరకలు అందిస్తున్న రంగనాథాన్ని చూస్తూ 'భూమికొచ్చినన్ని ఏళ్ళొచ్చాయి ఇద్దరికీ. అయినా జ్ఞానమూ వివరమూ లేకపోయాయి. అదేమన్నా చిన్నపిల్లా లేకపోతే నిన్నా మొన్నా పుట్టిందా? దాని నోటికి అందిస్తూ కూర్చున్నావు. తినలేకపోతుందా? అయినా ఒట్టిగొడ్డుకు ఆకలెక్కువని ఊరికే అన్నారా?' ఇంట్లో నుంచి బయటికి వస్తూ అరవసాగింది రాజమ్మ.
   ఆ మాటకు ఎద్దు నాలుగడుగులు వెనక్కి వేసింది. గడ్డిపరకలు పడేసి చివాలున చూసిన రంగనాథం భార్యనుద్దేశించి 'ఎందుకే రాజీ! పాపం దాన్నలా ఆడిపోసుకుంటావు? ఇప్పుడంటే ఇలా ఉందిగానీ... ఓపికున్నప్పుడు మన పొలంలో మనతోపాటే ఎండనక, వాననక, పగలనక, రేయనక మనకు తోడుగా నిలబడింది. ఇవ్వాళ ఓపిక తగ్గిందని వదిలేస్తామా?' అన్నాడు. తన్నుకొస్తున్న కోపం బయటకు కనబడనీయకుండా.
   'వదిలేయకపోతే నెత్తిన పెట్టుకుని ఊరేగు. ఎప్పుడో సాయం చేసిందని చచ్చేదాకా మోస్తాననేవాడిని నిన్నే చూస్తున్నా. ఇంట్లోవాళ్లకి మింగమెతుకు లేదని నేనేడుస్తుంటే, దాని ఒళ్లంతా సంపెంగనూనె రాయాలని నువ్వు చూస్తున్నావు. తిట్టినందుకు నా నోరే వినబడుతుందిగానీ చేసేపనుల్లో ఏమార్పూ రావట్లేదు' బియ్యం కడిగిన నీళ్లు తొట్లో పోసి, వెనక్కి తిరిగింది. కురుస్తున్న వాన ఒక్కసారి ఆగినట్లు తన్నుకొచ్చిన కోపం లోపలెక్కడో ఆగిపోయింది. దానిస్థానంలో ఏదో ఆవేదన, చెప్పలేని బాధ తన్నుకురాసాగింది. వెళ్తున్న భార్యతో 'ఎలా వదలమంటావు? చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవద్దూ! కనీసం కృతజ్ఞతైనా చూపించాలిగా? నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా తాత పొలానికెళ్తూ ఎద్దుల్ని తోలుకెళ్తుంటే నేనూ వస్తానని వెంటపడేవాడిని. నడుస్తున్నప్పుడు దాని కాళ్లవంకా, మోగుతున్న గంటవంకా, ఊపుతున్న తోకవంకా చూస్తూ ఎంతో సంతోషించేవాడిని. అదెప్పుడైనా చెట్టు కింద పడుకుంటే దాని పొట్టమీద పడుకుని ఏనుగెక్కినట్లు సంబరపడేవాడిని.
    తాత తరం ముగిసింది. వ్యవసాయమూ, ఎద్దులూ తండ్రి చేతికొచ్చాయి. నాకూ తండ్రికి సాయం చేసే వయసొచ్చింది. పొలం దున్నడం, బండి కట్టడం, ఎద్దులకు మేతేయడం, నీళ్లు తాగించడం, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం లాంటి అన్నిపనులూ నేర్చుకున్నాను. ఈ ఎద్దే లేకపోతే కనీసం నా తండ్రి చనిపోయిన సంగతీ మాకు తెలిసేది కాదు. మోటారు బిగించడానికి మనిషిలోతు గోతిలో దిగిన నా తండ్రి హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆ విషయం ఎవరికీ తెలియలేదు. ఒంటరిగా వచ్చిన ఎద్దుల్ని చూసి విషయం ఆరా తీస్తే, నిలువెత్తు గోతిలో నిర్జీవంగా తండ్రి కనిపించాడు. తండ్రి తరమూ ముగిసి, వ్యవసాయం నాచేతికొచ్చింది. ఒంటరిగా బతుకీడుస్తున్న నాకు నువ్వు తోడయ్యావు. పెళ్లైన కొత్తలో నిన్ను ఎద్దుల బండిలో కూర్చోబెట్టుకుని, సినిమాకి పోతుంటే ఊరు ఊరంతా వీధిలోకి వచ్చి చూసేవాళ్లు. ఎద్దుల్ని చూసి ముచ్చటపడేవాళ్లు. రోజులు గడిచేకొద్దీ మార్పులు సహజం. చెట్టుకి వేర్లెంత ముఖ్యమో పంట పండించే ప్రతీ రైతుకూ ఎద్దులు అంతే ముఖ్యం. ఎద్దుల్ని అమ్మడమంటే ప్రాణం పోయినట్లే. ఎద్దును వదలడమంటే ఊపిరి వదిలేసినట్లే!' అన్నాడు ఆవేశంతో కూడిన బాధతో.
      'ప్రవచనాలు చెప్తే డబ్బులొస్తాయిగానీ, వేదాంతం మాట్లాడితే వెర్రోడంటారు. గొడ్డుకు తిన్నది పుష్టి, మనిషికి ఉన్నది పుష్టి అని ఊరికే అనలేదుగా! మనకు కూడబెట్టిందేమీ లేకపోయినా, అది తిన్నదానికి మాత్రం లెక్కలేదుగా' విసవిసా నడిచి లోపలికెళ్లిపోయింది.
కొన్ని తర్కాలు ఆలోచనలకు అందవు.. కొన్ని ఆలోచనలు మనసుకు తట్టవు. తనకు సాయం చేసిందని ఎద్దుల మీద అభిమానం పెంచుకున్నాడు తను. తనను నమ్మి తాళి కట్టించుకుని కాపురం చేస్తున్న భార్య అవసరాల మీద కూడా బాధ్యత చూపించాలిగా?! గడ్డిపరక గాలికెగిరి ఎటుపడితే అటుపోతున్నట్లు ఆలోచనలు కూడా ఒక పద్ధతి లేకుండా ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి. నాలుగు గడ్డిపరకలు చేత్తో తుంచినట్లుగా, పేదరికం ఎంత బలమైన బంధాన్నైనా బలహీనంగా మార్చేస్తుంది. బెల్లం చుట్టూ మూగిన చీమల్లా, బతుకులో 'తీపి' ఉంటేనే ఆ బంధానికి విలువా, నలుగురిలో గుర్తింపూ ఉంటాయేమో!
    బాధగా ఎద్దులవంక చూశాడు. రంగనాథం ఆలోచనలను పసిగట్టినట్లుగా ఎద్దులు తలూపాయి. ఎద్దుల పుసిగట్టిన కంట్లో నుంచి నీరు ధారగా కారసాగింది. చెవుల్ని అటూఇటూ ఊపుతూ తాడును లాక్కుంటూ ముందుకూ వెనక్కూ కదిలాయి.
     తనకు తోడుగా నిల్చి, వ్యవసాయాన్ని వృద్ధిచేసిన ఎద్దు చచ్చిపోతే ఎంతో వ్యథ చెందిన తండ్రి గుర్తొచ్చాడు. పొలందాకా తీసుకెళ్ళి ఎద్దును పూడ్చడానికి సాయమెవరూ రాలేదు. పక్కమనిషి చచ్చిపోతే పట్టించుకోని జనాలు ఎద్దు చచ్చిపోతే ఎందుకొస్తారు? కొంతమంది వింత చూడడానికి ఇంటిచుట్టూ మూగారు. కొంతమంది పరిహాసానికి సిద్ధమయ్యారు. వచ్చినవాళ్లలో ఒకడు 'ఏరా! మనుషులు పోతేనే పూడ్చడానికి శ్మశానాలు చాలక జనాలేడుస్తుంటే, ఇప్పుడీ ఎద్దునెక్కడ పూడ్చుతావంట? దానికి జబ్బు చేసినప్పుడే తీసుకెళ్లి ఏ రోడ్డుపక్కనో వదిలేయాల్సింది. ఇప్పుడీ బాధ తప్పేదిగా!' అన్నాడు. ఆ మాటలు విననట్లుగా ఉండి, ఎంతో శ్రమపడి దాన్ని తీసుకెళ్ళి తన పొలంలోనే పూడ్చిపెట్టి, దాని రుణం తీర్చుకున్నాడు తన తండ్రి.
     గతమంతా ఒక చేదు జ్ఞాపకంగా మారి, కళ్ల ముందు కదలాడింది. లెక్కాపత్రం లేని ఆలోచనలు బుర్రను తొలిచేస్తున్నాయి. మౌనంగా ముందుకు కదిలాడు. తన చిన్నప్పుడు కాడెద్దులు ఉన్నవాళ్లని గొప్పగా చూసేవారు. వాటిని తోలుకుంటూ వెళ్తుంటే వాటి గిట్టల చప్పుళ్లు చూసి, పిల్లలు కేరింతలు కొట్టేవాళ్లు. సంక్రాంతి పండగొస్తే ఊరు ఊరంతా కడిగిపెట్టిన కొత్త బిందెలా తళతళలాడేది. అందరూ తమతమ పశువులను తీసుకొచ్చి, పసుపు, కుంకుమ రాసి, దండలేసి హారతులిచ్చేవాళ్లు. తమ కుటుంబాలు వర్ధిల్లడానికి కారణమైన ఎద్దులకు దిష్టి తీసి, మొటికలు విరిచేవాళ్లు. రాజులతో పాటే రాజ్యాలు, వాటితో పాటే అలనాటి భోగాలన్నీ అంతరించిపోయినట్లు కాలమూ పగబట్టిన తాచుపాములా మారిపోయింది. ఓడలు బళ్లు, బళ్లు ఓడలయ్యాయి. ఆచారంగా వస్తున్న సంప్రదాయాలన్నీ అటకెక్కిపోయాయి. పండుగలూ లేవు, పబ్బాలూ లేవు, సరదాలు అసలే లేవు. పండగలే లేనప్పుడు పశువులు మాత్రం ఎందుకు? పొలాల వెంట తిరిగి గడ్డి కోసుకురావడం, ఎండుగడ్డిని ఎక్కువరేటు పెట్టి కొనాల్సి రావడంలాంటి కారణాల వల్ల వచ్చిన రేటుకు పశువుల్ని అమ్ముకుని, ఎవరికి వారు ఊపిరి పీల్చుకున్నారు.
     తొలకరిలో వానలు పడవు, వ్యవసాయం సాగదు. విపరీతమైన ఎండల్లో కుండపోతగా కురుస్తాయి. కాలం కట్టుదప్పినప్పుడు మనుషులు మాత్రం కాలానికి ఎదురీదుతూ ఎన్నాళ్లుంటారు? తాత, తండ్రి అంటూ పశువుల మీద ప్రేమతో తానే ఇన్నాళ్లూ ఎద్దుల్ని అమ్మకుండా జీవితం భారమైనా నెట్టుకొస్తున్నాడు. ఒక్కోసారి వాటికి సరిపడినంత గడ్డి కూడా ఉండదు. అలాంటప్పుడు వాటివైపు చూడాలంటే మనసు మెలితిప్పినట్టు ఉంటుంది. వెయ్యేనుగులు ఒక్కసారే ఘీంకరించినట్లుగా ఉంది ఆకాశం. అప్పుడప్పుడూ వచ్చే మెరుపుల వల్ల పడుతున్న వాన ఎంత ఉధృతంగా ఉందో తెలుస్తోంది. వసారాలో మంచం మీద కూర్చుని, మాటిమాటికీ కొంచెం దూరంలో ఉన్న ఎద్దుల చావిడి వైపు చూడసాగాడు రంగనాథం. దేనికోసం చూస్తున్నాడో అర్థమైన రాజమ్మ తోకతొక్కిన తాచులా ఎగిరిపడింది. 'ఎన్నిసార్లు చెప్పినా ఎద్దుల మీదుండే ప్రేమ తగ్గదు నీకు. అవసరమైతే నన్నైనా వదిలేస్తావుగానీ వాటిని మాత్రం వదిలిపెట్టేలా లేవు!' అంటూ అరవసాగింది.
    కాసేపయ్యాక 'మనమీద ఆధారపడిన మూగజీవాలవి. అస్తమానం వాటి గురించి చెడ్డగా మాట్లాడకూడదు. మనకు కలిగింది పెట్టాలిగానీ తిట్టకూడదు' అన్నాడు తోచినవైపు చూస్తూ. 'ఎందుకు పెట్టం? కలిగిందీ లేనిదీ కూడా పెడుతూనే ఉన్నాం కదా! ఓపిక తగ్గిపోయిందని పొలానికి తీసుకెళ్లకుండా పందిట్లో పెట్టి మేపుతున్నావు. ఒకవేళ తీసుకెళ్లినా ఎకరం దున్నడానికి ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేము. అన్నిరోజులు దండగెందుకని ట్రాక్టర్లకీ, కొత్తగా వచ్చిన మిషన్లకీ డబ్బులిచ్చి చేయించుకుంటూనే ఉన్నాం కదా! అప్పులే చేస్తున్నామో, తిప్పలే పడుతున్నామో దానికి ఏ లోటూ రాకుండా గడ్డీగాదం కూరి, ముప్పొద్దులా మేపుతూనే ఉన్నాంగా! పనికిరాని ఎద్దుల్నమ్మి, పనికొచ్చేది ఏదో ఒకటి తెమ్మంటున్నాను. నువ్వు నా మాట వినవు' పమిటకొంగుతో ముక్కును ఎగబీల్చి తుడుచుకుంటూ అంది. ఏమీ మాట్లాడకుండా గొడుగు తీసుకుని పైకి లేచాడు. అది చూసిన రాజమ్మకి కోపం నషాలానికంటింది. 'ఉంటే బెల్లంకొట్టిన రాయిలాగా మొద్దులా కూర్చుంటావు. లేదంటే ఏమీ పట్టనట్లు లేచి వెళ్లిపోతుంటావు. నేనొక్కదాన్నే పిచ్చిదానిలా నాలో నేనే మాట్టాడుకోనా? ఇదిగో.. ఈ దుప్పటి తీసుకెళ్లి వాటితో పాటు నువ్వు కూడా అక్కడే పడుకో!' దుప్పటి ముఖాన విసిరి ఇంట్లోకి వెళ్ళిపోయింది రాజమ్మ.
     మాగినపండు మీద మాటిమాటికీ వాలే ఈగల్లా ఆలోచనలు ముసురుకున్నాయి. తన తండ్రి తనకు కనీసం పదిసెంట్ల భూమినీ, ఎద్దుల్ని వారసత్వంగా ఇచ్చాడు. తనకు లేకలేక పుట్టిన కొడుక్కి తనేమివ్వాలి? ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంతో తమకు దూరంగా బతుకుతున్నాడు. ఇప్పుడంటే ఖర్చులెక్కువ చుట్టుకుంటాయేమోనని ఇంటికి రావడం మానేశాడు. కానీ ఏదో ఒకనాడు వచ్చి ఇల్లూ, పొలమూ తనకు కావాలంటే తనేం చేయగలడు ?
     ఆలోచనలతోనే పశువుల కొట్టంలోకి చేరుకున్నాడు. ఎక్కడంటే అక్కడ కురుస్తున్న పశువుల కొట్టాన్ని చూసి, గట్టు తెగిన కాలువలా మనసు పరితపించింది. అటూఇటూ ఒక్కో అడుగేస్తూ తోకలు ఊపుకుంటూ కనిపించాయి ఎద్దులు. దగ్గరికెళ్ళి చేతితో తట్టాడు. ప్రాణం పోతున్నవాడికి తులసితీర్థం పోస్తే ఆఖరిచూపు చూసినట్లుగా ఎద్దులు ఆ స్పర్శకు పులకించిపోయాయి. ఎద్దుల వంక చూశాడు. ఎద్దులూ అతనివంక చూశాయి. ఆ చూపుల్లో ఏళ్ల తరబడి దాచుకున్న అవ్యక్తానుబంధమేదో కనిపించింది.
    వాన తగ్గిన తర్వాత చెప్పాపెట్టకుండా వచ్చిన కొడుకుకి అన్నం పెట్టి 'ఏరా... అసలు ఇంటికి రావడమే మానేశావు? రెండు ముసలిప్రాణాలు ఆశలన్నీ నీమీదే పెట్టుకుని ఉంటాయని మర్చిపోయావా?' అంది రాజమ్మ. దించిన తల ఎత్తకుండా తింటూ మధ్యమధ్యలో వింటున్నానన్నట్లుగా తలూపసాగాడు రాఘవ్‌. 'ఉద్యోగం బాగుందా?' మళ్లీ అడిగింది రాజమ్మ.
    'ఆ మాట ఏమడుగుతావులే అమ్మా ! ఏదో మీ మీద ఆధారపడకుండా ఉండాలని అంతే? అన్నాడు. 'ఇక్కడ వ్యవసాయమూ లేదు, ఫలసాయమూ రాదు. ఆ కూలికీ, ఈ పనికీ వెళ్లి ఏదో నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రోజులు నెట్టుకొస్తున్నాము. మాకే ఇంట్లో ఇబ్బందిగా ఉంది. ఇక ఎద్దులకి గడ్డి తేవడం ప్రాణాల మీదకొస్తొంది. వాటిని అమ్మమంటే మీ నాన్న నా మాట వినడు..' అంది రాజమ్మ.
    సంభాషణ అటు తిరిగి, ఇటు తిరిగి ఎద్దుల మీదకొచ్చేసరికి ప్రాణం ఉసూరనిపించింది రంగనాథానికి. భార్య మాటలకు కొడుకూ వత్తాసు పలుకుతాడేమోనని కంగారుపడ్డాడు.
    కాసేపయ్యాక 'అంత ఇబ్బంది అయినప్పుడు వాటిని అమ్మేస్తే ఎంతోకొంత ఒడ్డున పడేవాళ్లు కదా నాన్నా!' అన్నాడు చేయి కడుక్కుంటూ. పది లంఖణాలు చేసినట్లుగా ఉంది ప్రాణం. గొంతుపెగిలి ఒక్కమాటా రావట్లేదు. 'నిన్నే అడిగేది... మాట్లాడుతుంటే దిక్కులు చూత్తే ఎట్టా?' అంది రాజమ్మ. తండ్రి ఏమీ మాట్లాడకపోవడంతో తనే కల్పించుకుంటూ 'ఎద్దులు సంగతి తర్వాత చూడొచ్చులే అమ్మా... నేను ఇంకో ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని ఇంటికొచ్చాను' అన్నాడు రాఘవ్‌. భార్యాభర్తలిద్దరూ తెల్లబోయి కొడుకు వైపు చూశారు. ఏదో తెలియని ఆందోళన ఇద్దరిలోనూ కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. 'మీ కోడలు అపార్ట్‌మెంట్‌ కొందామని ఒకటే గొడవ. ఏదో ఖర్చులన్నీ పోగా అప్పుడప్పుడూ దాచిపెట్టిన డబ్బు కొంతవరకూ పర్లేదుగానీ పూర్తిగా సరిపోదు. అందుకే ఈ ఇల్లూ పొలమూ అమ్మేద్దామని అనుకుంటున్నా' అన్నాడు ఇద్దరి కళ్లల్లోకి చూస్తూ.
      చాలాకాలం నుంచీ వానలు పడక ఎండిన నేలలాగా ఉన్నాయి ఇద్దరి ముఖాలు. కాసేపు గడిచాక 'పొలమంటే అమ్మక తప్పదనుకో..కానీ ఇల్లూ అమ్మితే ఎలా? ఈ వయసులో మేమిద్దరం ఎవరి పంచనో ఉండడం నీకూ గౌరవం కాదు గదా !' అనగలిగాడు.
   'మరీ అంత దారుణంగా ఎలా ఆలోచిస్తాను నాన్నా? అమ్మేశాక మీరిద్దరూ నాదగ్గరే ఉంటారు కదా! ఇంట్లో పిల్లలున్నారు కాబట్టి, మీకూ కాలక్షేపం అవుతుంది. సంతోషంగా అందరం ఒకేచోట ఉండొచ్చు కదా?' అన్నాడు రాఘవ.
   'నువ్వు చెప్పిందీ నిజమేరా ! కాకపోతే పుట్టిపెరిగిన ఊళ్లో పస్తులున్నా బాగుంటుందిరా. మనది కాని చోట మహారాజులా బతికినా మనోరోగం వెంటాడుతూనే ఉంటుంది. మీ తాత తరం నుంచీ ఈ ఊరూ గాలీ అన్నీ నా నరనరంలోనూ ఇంకిపోయాయి. ఏదో చుట్టం చూపుగా అంటే రావచ్చుగానీ... ఊరు దాటాల్సి వస్తే శ్మశానానికి తప్ప ఇంకే ఊరిలోనూ ఉండలేనురా' అన్నాడు స్థిరంగా. కళ్ల నీళ్లు కళ్లల్లోనే కుక్కుకుంటూ భర్తవంక చూసింది రాజమ్మ. తండ్రి గొంతులో స్థిరత్వాన్ని చూసి కంగారుపడ్డాడు రాఘవ.
రోజులు భారంగా గడుస్తున్నాయి కాబట్టి తీసుకెళ్తానని చెప్పగానే తల్లిదండ్రులిద్దరూ ఒప్పుకుంటారని అంచనా వేశాడు. పైగా తల్లి తన తరుపునే మాట్లాడుతుందనుకున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ఎద్దుల విషయంలో తండ్రిని వ్యతిరేకించింది కాబట్టి తన నిర్ణయాన్ని సమర్ధిస్తుందని అనుకున్నాడు. కానీ తల్లిని చూస్తుంటే ఆ ఆశా సన్నగిల్లింది.
     'ఎక్కడున్నా రోజులు సుఖంగా గడవాలి నాన్నా! అయినా పూటగడిచే దారి చూసుకోవాలిగానీ ఇల్లూ ఊరూ ఎద్దులూ అనే సెంటిమెంట్లు పనికిరావు. ఏ పనిచేస్తున్నా మనకెంత లాభం వస్తుందో అంచనా కట్టుకోవాలి. అందుకనుగుణంగా దారులు వేసుకోవాలి. బాగా డబ్బులిచ్చి చదివించకపోయినా ఏదో వానాకాలం చదువైనా చెప్పించారు. అయినా నా తెలివితేటలతో చిన్న ఉద్యోగం సంపాదించుకుని, మీమీద ఆధారపడకుండా బతుకుతున్నాను. జన్మనివ్వడం తప్ప.. మీరు నాకోసం ఏమీ చేయకపోయినా కృతజ్ఞతతో మిమ్మల్ని నా దగ్గర పెట్టుకుందామనుకున్నాను. దానికి కూడా మీరు' అర్థమైందా? అన్నట్లుగా ఇద్దరి వంకా చూశాడు.
    పక్కా వడ్డీవ్యాపారిలా లెక్కలు మాట్లాడిన కొడుకు వంక బిత్తరపోయి చూశాడు. అయినా ముఖంలో ఏ భావమూ కనబడనీయకుండా నిర్లిప్తంగా చూస్తుండిపోయాడు రంగనాథం. కొడుకు రూపంలో కళ్లముందు నుంచున్న పుట్టెడు విషాదాన్ని చూస్తూ కుమిలి కుమిలి తనలో తనే ఏడవసాగింది రాజమ్మ. మనిషి పోయినప్పుడు ఏర్పడే నిశ్శబ్దమేదో ఇల్లంతా అలుముకుంది. ఉన్నట్టుండీ హఠాత్తుగా పైకిలేచిన రాజమ్మ కళ్లను చీరచెంగుతో తుడుచుకుని, జట్టు ముడేసుకుంది. ఇంట్లో నుంచి బయటకు వస్తూ 'చూడు నాయనా.. లేకలేక పుట్టిన కొడుకువని మేమూ పస్తులుండి నీ కడుపు నింపాము. నాలుగు గడ్డిపరకలు తిన్న ఎద్దులు మా కష్టాల్లో పాలుపంచుకున్నాయి. కానీ పాలిచ్చి, పెంచిన కొడుకు రొమ్ముమీద గుద్దాలని చూస్తున్నాడు. బుద్ధిలేనిదాన్ని.. మీ నాన్న ఎంత చెప్తున్నా వినకుండా.. ఎద్దులమ్మమని ఎంతో ఒత్తిడి చేశాను. ఇప్పుడు మా ఇద్దరిదీ అదే పరిస్థితి అయ్యేలా ఉన్నందుకు బాధపడుతున్నాను. ఓపికున్నంత వరకూ పనిచేయించుకుని, ఓపిక తగ్గిపోయాక కబేళాకు అమ్మేయమని చెప్పాను. ఇప్పుడు మా ఓపికా తగ్గింది కాబట్టి మమ్మల్ని ఎలాగైనా వదిలించుకోవాలని నువ్వు చూస్తున్నావు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా.. పొలం అమ్ముకో.. సరిపోకపోతే ఇల్లు కూడా అమ్ముకో! కానీ పశువుల కొట్టంలోకి మాత్రం రావద్దు. ఇకనుంచీ ఎద్దులతో పాటు మేమూ అక్కడే ఉంటాం' అని చెప్పి బయటికి వెళ్లిపోయింది రాజమ్మ.
     భార్యవంక ఆశ్చర్యంతో చూడసాగాడు రంగనాథం. తమవైపు వస్తున్న రాజమ్మను చూసి ఎద్దులు రెండడుగులు వెనక్కి వేశాయి. గడ్డిపరకల్ని చేత్తో పట్టుకుని ఎద్దుల్ని సమీపించిన రాజమ్మ ప్రేమగా వాటి నోటికి అందించింది. ఎద్దులకేదో తెలియని శక్తి ఆవహించింది.. రంగనాథం మనసు తేలికైంది.


(డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

డా. జడా సుబ్బారావు

9849031587