Jul 27,2021 18:56

ముంబయి : అశ్లీల చిత్రాలను తీసి.. వాటిని కొన్ని యాప్‌ల ద్వారా విడుదల చేశారనే ఆరోపణలపై నటి శిల్పాశెట్టి భర్త అరెస్టయిన విషయం తెలిసిందే. మంగళవారం అతన్ని పోలీసులు మేజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరుపరచగా.. కోర్టు అతన్ని 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. కాగా, రాజీవ్‌ కుంద్రా బెయిల్‌ కోసం కోర్టులో వేసిన పిటిషన్‌... ఆ పిటిషన్‌ బుధవారం విచారణకు రానుంది.
ఈ కేసు దర్యాప్తులో, కుంద్రా ఆర్మ్స్‌ప్రైమ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసి, లండన్‌ కేంద్రంగా ఉన్న కెన్రిన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా సోపల్‌ మీడియాలో అభ్యంతరకరమైన వీడియోలను అప్‌లోడ్‌ చేయడానికి 'హాట్‌షాట్స్‌' యాప్‌ను కొనుగోలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. అలాగే నిందితుని కార్యాలయంలో 51 అశ్లీల వీడియోలను కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే కుంద్రా.. 119 అశ్లీల చిత్రాలను ఓ వ్యక్తికి 1.2 మిలియన్‌ డాలర్లకు అమ్మే యోచనలో ఉన్నట్లు క్రైంబ్రాంచ్‌ గతంలో కోర్టుకు తెలిపింది.