Jul 26,2021 13:32

రాంచీ : జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన మరుసటి రోజు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కొంత మంది పలు మార్లు కలిసి.. రాష్ట్రంలోని జెఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు రూ. కోటి రూపాయలు ఇవ్వజూపారని చెప్పారు. మంత్రి పదవిని ఇస్తామని ఆశచూపారని అన్నారు. కోలేబిరా ఎమ్మెల్యే నమన్‌ బిక్సల్‌ కొంగరీ మాట్లాడుతూ... ముగ్గురు వ్యక్తులు సుమారు ఆరు సార్లు తనను కలిశారని చెప్పారు. 'మా పార్టీ కార్యకర్తల ద్వారా ముగ్గురు వ్యక్తులు తనను కలిశారు. పలు కంపెనీల్లో పనిచేస్తున్నామని అన్నారు. ఇక్కడి నుండి వెళ్లిపోండని చెప్పా. మళ్లీ తిరిగి వచ్చి...కోటి రూపాయలకు పైగా ఇస్తామని అన్నారు. డబ్బులే కాకుండా మైనార్టీ, గిరిజన వ్యవహారాలకు సంబంధించి తమ ఎజెండాకు మద్దతు తెలిపి... మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపారు' అని ఎమ్మెల్యే చెప్పారు. దీన్ని బిజెపి కోసం చేస్తున్నామని చెప్పారని, కానీ ఆ పార్టీ చెందిన కార్యకర్తలెవ్వరూ తనను సంప్రదించలేదని వెల్లడించారు. దీంతో తాను వెంటనే కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సిఎల్‌పి) నేత అలమ్‌గిర్‌ అలం, కాంగ్రెస్‌ జార్ఖండ్‌ ఇన్‌చార్జ్‌ ఆర్‌పిఎన్‌ సింగ్‌, ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ కూడా సమాచారమిచ్చానని తెలిపారు. ఆర్‌పిఎన్‌ సింగ్‌తో సంప్రదించగా...తాను ఈ విషయంపై మీడియాతో చర్చించనని అన్నారు. కాగా, ముఖ్యమంత్రి సోరెన్‌ సైతం ఏమీ స్పందించలేదు.