
వీరబల్లి : మండలంలోని వీరబల్లి పంచాయతీలో ఉన్న ఝరికోన చెరువుకు సంబంధించిన భూమిని కొందరు రైతులు ఆక్రమించుకొని చదువును చేశారు. చుట్టుపక్కల భూముల్లో ఉన్న వృథా మట్టిని, రాళ్లను, చెట్లను జెసిబిలతో తొలగించి, ట్రాక్టర్లతో తీసుకొని వచ్చి చెరువులో తోలుతున్నారు. కొందరు చెరువు భూమిని అక్రమించుకోవడమే కాకుండా, తమ భూముల్లో ఉన్న మట్టిని, రాళ్ళను తీసుకొని వచ్చి చెరువును పూడ్చేస్తున్నారు. చెరువులో నీరు నిలవ కుండా పోవడాకి అవకాశం ఉంది. చెరువు స్థలం ఆక్రమణకు గురై చివరకు పూర్తిగా చేరువే లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల అయకట్టుదారులు పూర్తిగా నష్టపోనున్నారు. ఆక్రమణదారుడొకరు చెరువు మధ్యలో రెండు బోర్లు వేశారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మన్‌ను చెరువులో భూమికి దగ్గరగా ఏర్పాటు చేశారు. చెరువు వర్షపు నీటితో నిండినప్పుడు విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చెరువులో బోర్లు వేయడంతో నీటి శాతం తగ్గిపోయి ఆయకట్టుదారుల బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. చెరువు నీటిని పోనివ్వకుండా మొరవకు ముళ్ళ తంతె కంచను ఏర్పాటు చేశారు. మొరవ ద్వారా నీరు పోకుండా చెరువు నీటి శాతం పెరిగి చెరువు కట్ట కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మండల రెవెన్యూ అధికారులు ఝరికోన చెరువును పరిశీలించి ఆక్రమణ గురికాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. మొరవకు వేసిన కంచెను తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు.