
రెండవ తరగతి చదివే లతకు గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ జడలో ఒక పువ్వు పెట్టుకోవాలని ఒకటే కోరిక. కాని పేద కుటుంబం కావడంతో గులాబీలు కొనే స్థోమత లేదు. ఒక రోజు తనకి ఓ ఆలోచన వచ్చింది. ఇంటి ముందు గులాబీ మొక్కలు నాటుకొని పెంచుకుంటే రోజూ కావలసినన్ని పూలు పెట్టుకోవచ్చు అనుకుంది. 'గులాబీ మొక్కలు ఎవరి ఇంటిలో వున్నాయా?' అని వెదుక్కుంటూ బయలుదేరింది. ఆ ఊరిలో ఒక ధనవంతునికి పెద్ద తోట వుంది. అందులో రకరకాల రంగురంగుల గులాబీ మొక్కలు కనబడ్డాయి. తోట ముందు వాకిలి వద్ద తోటమాలి వున్నాడు. లత నెమ్మదిగా వెనుక నుంచి గోడ దూకి లోపలికి పోయింది. ఒక కొమ్మ తెంచబోయింది. అంతలో తోటకు కాపలా వున్న తోటమాలి ఆ పాపను చూశాడు. ''ఏరు... ఎవరది'' అంటూ గట్టిగా అరిచాడు. లత భయపడి వెనక్కు తిరిగి పరుగు దీసింది. ఎదురుగా ఒక పెద్ద రాయి కాలికి తగిలి కింద పడిపోయింది. మోకాళ్ళూ, మోచేతులకు దెబ్బలు తగిలాయి. నొప్పికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంతలో తోటమాలి అక్కడికి వచ్చాడు. ఆ పాపను పైకి లేపాడు. 'తోటలోకి ఎందుకు వచ్చావు' అని అడిగాడు. లత తల వంచుకుని 'గులాబీ పూల చెట్టు' కోసమని భయపడుతూ సమాధానం ఇచ్చింది. ఆ తోటమాలి లతను పైకి లేపి, ఓదార్చుతూ 'అడగకుండా దొంగతనంగా రావడం తప్పుగదా. ఏదైనా అడిగి తీసుకోవాలి. నీలాంటి చిన్న పిల్లలు మంచి మనసుతో అడిగితే ఎవరు కాదంటారు చెప్పు. ఇంకెప్పుడూ ఇలా చేయవద్దు' అన్నాడు. తోటలోకి పోయి రంగు రంగుల గులాబీ మొక్కలు తెచ్చి ఇచ్చి వాటిని ఎలా పెంచాలో చెప్పాడు. లత సంబరంగా ఇంటి ముందు గులాబీ మొక్కలు నాటింది. కొద్ది రోజులకు అవి బాగా పెరిగి రంగురంగుల పూలు పూశాయి.
- డా.ఎం.హరికిషన్
94410 32212