Sep 16,2023 21:54

రాజన్నదొరకు వినతిని అందజేస్తున్న జ్యూట్‌మిల్‌ జెఎసి నాయకులు

సాలూరు: మండలంలోని జీగిరాం జ్యూట్‌ మిల్‌ను 16 నెలలుగా యాజమాన్యం నిరవధికంగా మూసివేసిందని, తెరిపించేందుకు కృషి చేయాలని జ్యూట్‌మిల్లు కార్మిక జెఎసి డిప్యూటీ సిఎం పీడిక రాజన్న దొరను కోరింది. ఈ మేరకు శనివారం జెఎసి నాయకత్వం రాజన్నదొర నివాసంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఉపాధి నిచ్చేది జీగిరాం జ్యూట్‌ ఫ్యాక్టరీ అని, దీన్ని తెరిపించడానికి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ సమస్యను తహశీల్దార్‌, ఎసిఎల్‌ దృష్టిలో పెట్టినా యాజమాన్యం స్పందించలేదని తెలిపారు. డిప్యూటీ సిఎం కలుగజేసుకొని అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరించి కార్మికులకు ఉపాధి చూపించేలా నిర్ణయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ఈ సమస్యను నివేదించి, కార్మికుల పక్షాన ఉంటానని రాజన్న తెలిపారు. కార్యక్రమంలో కార్మిక జెఎసి నాయకులు ఎన్‌వై నాయుడు, కె.శ్రీను, ఆర్‌.సింహాచలం, ఎస్‌.సింహాచలం, కె.నారాయణ, సూరప్పలనాయుడు, సుధ, తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.