లాకౌట్ బాధిత కార్మిక సంఘం నేతలు
ప్రజాశక్తి -తగరపువలస : జ్యూట్ మిల్లు కార్మికులందరికీ చెల్లింపులు చేసినట్లుగా అటు జెసిఎల్, ఇటు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన జ్యూట్ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చిట్టివలస జ్యూట్ మిల్లు లాకౌట్ బాధిత కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విఎస్‌ఎఎన్ రాజు, జీరు వెంకటరమణ, గౌరవాధ్యక్షులు ఎన్.అప్పలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్ర వారం సంఘంకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, చెల్లింపుల కోసం తమ సంఘ సభ్యులతో పాటు సుమారు 500 మంది కార్మికులు కనీసం దరఖాస్తు చేసుకోలేదన్నారు. దరఖాస్తు చేసుకోలేనప్పుడు, తమకు చెల్లింపులు చేసినట్లుగా యాజమాన్యం తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని తీవ్రంగా ఖండించారు. కార్మికులను, కోర్టులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న యాజమాన్యం, యాజమాన్య ప్రతినిధులు, నాలుగు కార్మిక సంఘాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జెసిఎల్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు సింగిడి అప్పారావు, దాలయ్య రెడ్డి, జన్నుల రమణ, పి శివ, ఎం శంకర్ పాల్గొన్నారు.










