Nov 01,2022 23:40

శిక్షణ ప్రారంభంలో మాట్లాడుతున్న నాబార్డు డిడిఎం శ్రీనివాసరావు

ప్రజాశక్తి- భీమునిపట్నం : ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధం నేపథ్యంలో జ్యూట్‌ సంచుల తయారీలో మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు నాబార్డు ఉమ్మడి విశాఖ జిల్లా డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ శ్రీలిఖి ఉమెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మైక్రో ఎంటర్‌ ప్రైజస్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా జివిఎంసి నాల్గో వార్డు మంగమారిపేటలో నాబార్డు సహకారంతో ఏర్పాటుచేసిన జ్యూట్‌ బ్యాగులు, గుడ్డ సంచుల తయారీ ఉచిత శిక్షణా తరగతులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు జ్యూట్‌ బ్యాగులు, గుడ్డ సంచుల వినియోగం ఎంతో అవసరమని చెప్పారు. శిక్షణ పొందిన మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి సహకారం అందిస్తామని తెలిపారు. యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వివేక్‌ మాట్లాడుతూ, సొంత యూనిట్ల స్థాపనకు బ్యాంక్‌ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీలిఖి ఉమెన్‌ వెల్ఫేర్‌ సంస్థ కార్యదర్శి జి.మాధవి, సభ్యులు సురేష్‌, ట్రైనర్‌ జయ, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.