ప్రజాశక్తి -తగరపువలస : చిట్టివలస జ్యూట్ మిల్లు క్వార్టర్లలో నివాసితులందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని సిఐటియు నేతలు కోరారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌డిఒ ఎస్ భాస్కరరెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, జ్యూట్ క్వార్టర్లలో ఉన్న వారంతా సొంత ఇంటి స్థలం లేని పేదలేనన్నారు. జ్యూట్ క్వార్టర్స్ స్థలం ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులే నిర్ధారించిన నేపథ్యంలో కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.ప్రభుత్వ అనుమతి లేకుండా జ్యూట్ మిల్లు అక్రమ లాకౌట్‌తో అనేక మంది కార్మికులు ఉపాధి కోసం వేర్వేరుప్రాంతాలకు వెళ్లిపోయారని, 13ఏళ్లుగా కార్మిక కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన రూ.8లక్షలు చొప్పున పరిహారంలో యాజమాన్యం మొండికేసిన నేపథ్యంలో కనీసం ప్రభుత్వపరంగానైనా కార్మిక కుటుంబాలకు ఇళ్లస్థలాలిచ్చి ఆసరాగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, రవ్వ నరసింగరావు, ఎస్ అప్పలనాయుడు, డి.బాబాజీ పాల్గొన్నారు.










