ప్రజాశక్తి -తగరపువలస : చిట్టివలస క్రిస్టియన్‌పేటలో ఉన్న జ్యూట్ క్వార్టర్లను జెసిబిల సాయంతో తొలగించారు. న్యాయస్థానంలో స్టే ఉంటుండగా బలవంతంగా తొలగించడం అన్యాయమని క్వార్టర్లలో నివసిస్తున్న కొందరు తొలగింపును అడ్డుకున్నారు. మిల్లు యజమాని నుంచి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు అక్కడకు వచ్చిన వ్యక్తి స్థానికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. క్వార్టర్లు కూల్చిన అనంతరం కలపను వెంట తీసుకొచ్చిన వాహనాల్లో తరలించారు.
అడ్డుకున్న కార్మిక సంఘం నాయకులు
శనివారం నుంచి ప్రారంభమైన క్వార్టర్ల తొలగింపు ఆదివారం కూడా కొనసాగింది. సమాచారం తెలుసుకున్న చిట్టి వలస లేబర్ యూనియన్ (ఎఐటియుసి), జ్యూట్ మిల్లు కాంగ్రెస్ కార్మిక సంఘం, జ్యూట్ వర్కర్స్ యూనియన్ (టిఎన్‌టియుసి) నాయకులు కొండపు ఈశ్వరరావు, దల్లి అప్పలరెడ్డి, ఎంవి.గురుమూర్తి తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు. ఎస్‌ఐ జి హరీష్ ఘటనా స్థలానికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.










