ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సిఐటియు ధర్నా
జెసి విశ్వనాథన్‌కు వినతిపత్రం అందజేత
ప్రజాశక్తి - భీమునిపట్నం చిట్టివలస జ్యూట్ కార్మిక వాడలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న అర్హులైన కార్మిక కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని సిఐటియు నేతలు కోరారు. ఈమేరకు బుధవారం జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్‌కు వినతిపత్రం అందజేశారు. బుధవారం భీమిలి పర్యటనలో భాగంగా స్థానిక ఆర్‌డిఒ కార్యాలయానికి వచ్చిన జెసిని కలిసిన సిఐటియు నేతలు కలిసి, సమస్యను విన్నవించి వినతిపత్రాన్ని అందజేశారు. జ్యూట్ కార్మికవాడ స్థలం ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులే తేల్చినందున, సంబంధిత స్థలాన్ని స్వాధీన చేసుకుని, అర్హులైన కార్మికులకు అక్కడే ఇళ్ళ స్థలాలు, పట్టాలు ఇవ్వాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్ నాయకులు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, రవ్వ నరసింగరావు, ఎస్ అప్పలనాయుడు, డి బాబాజీ ఉన్నారు. అంతకు ముందు ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట జ్యూట్ కార్మిక కుటుంబాలకు చెందిన మహిళలతో ఇదే సమస్యపై ధర్నా చేశారు.










