Aug 24,2023 22:06

ఇచ్ఛాపురం : ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి- కవిటి : జయహో భారత్‌ అంటూ విద్యార్థులు నినదించారు. కవిటి పురవీధుల్లో ఊరేగుతూ భారత్‌ శాస్త్రవేత్తల ఖ్యాతిని కొనియాడారు. చంద్రయాన్‌-3 విజయవంతమైన సందర్భంగా స్థానిక కళ్యాణి ఆంగ్ల పాఠశాల విద్యార్థులు చంద్రయాన్‌-3 నమూనాతో కవిటిలో గురువారం ర్యాలీ నిర్వహించారు. కవిటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇస్రో, ఇండియా ఆకారంలో విద్యార్థులు మానవహారం చేపట్టారు. ముఖ్య అతిథి, విశ్రాంత సైన్స్‌ ఉపాధ్యాయుడు పండి బలరామమూర్తి ఇస్రో పనితీరు, చంద్రయాన్‌ విజయవంతంలో శాస్త్రవేత్తల కృషి, కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికత గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రాము టీచర్‌ చేసిన చంద్రయాన్‌-3 నమునా ఆకట్టుకుంది. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, కళ్యాణి ఆంగ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిందు మాధవి, బల్లెడ రమేష్‌, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కళ్యాణి ఆంగ్ల పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్బన్‌ : నగరంలోని బ్యాంకర్స్‌ కాలనీలో ఉన్న సాయిప్రియదర్శిని ఎడ్యుకేషనల్‌ సొసైటీలో నడుపుతున్న విశాఖ స్కూల్‌ చంద్రయాన్‌-3 చంద్రునిపై కాలు మోపి చరిత్ర సృష్టించిన సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్థానిక ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ సౌజన్యంతో బ్యాంకర్స్‌కాలనీ నుంచి రామలక్ష్మణ కూడలి, అక్కడ నుంచి సూర్యమహల్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. జయహో స్లోగన్స్‌తో ఇస్త్రో బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రయాన్‌-తో మొదలుపెట్టి నేటి చంద్రయాన్‌-3 వరకు వివరిస్తూ... ఈ విషయం వెనుక ఉన్న ఇస్త్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ఇటువంటి విజయాలు ఇంకెన్నో సాధించి భారతదేశ ఖ్యాతిని కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో స్కూల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.మధుసూదన్‌, ప్రధానోపాధ్యాయులు పి.రామారావు, ఉపాధ్యాయులు, ఐఎసి డైరెక్టర్‌ డి.వి.రమణ పాల్గొన్నారు.
కాకినాడ ఆదిత్య...
భారతదేశ అంతరిక్ష్‌ సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-3 చంద్రునిపై విజయవంతంగా కాలుమోపి కొత్త చరిత్రకు నాంది పలికిందని కాకినాడ శ్రీఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.వి.వేణుగోపాల్‌ అన్నారు. ఈ మేరకు 300 మంది విద్యార్థులతో విజయహర్ష ద్వానాల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. తమ విద్యార్థులందరిలో ఈ చంద్రయాన్‌-3 ఒక మంచి స్ఫూర్తి నింపుతుందన్నారు. ప్రతి విద్యార్థిలోనూ సైన్స్‌పై ఒక జిజ్ఞాసకు కలిగించిందన్నారు. కార్యక్రమంలో కళాశాల అకడమిక్‌ డైరెక్టర్‌ బి.ఇ.వి.ఎల్‌.నాయుడు, సెక్రటరీ సుగుణారెడ్డి పాల్గొన్నారు.
చంద్రయాన్‌-3 విజయవంతం కావడం అభినందనీయమని, మున్ముందు ప్రపంచంలో మేటి భారత్‌ అని గర్వంగా చాటి చెప్పాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సురేఖ అన్నారు. నగరంలో స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చంద్రయాన్‌-3 విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ కళాశాల నుంచి అంబేద్కర్‌ కూడలి వరకూ సాగింది. కార్యక్రమంలో వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులు జి.ఇందిరాప్రసాద్‌, పి.జి.గుప్త, శాసపు జోగినాయుడు, బి.వి.రవిశంకర్‌, గుడ్ల సత్యనారాయణ, సింహాద్రి వేణుగోపాల్‌, బి.దేవీప్రసాద్‌, ఎం.మల్లిబాబు, ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం : మిషన్‌ చంద్రయాన్‌-3లో భాగంగా పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా చంద్రునిపై కాలుమోపడం మన శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయమని మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ బి.రాధాకృష్ణ అన్నారు. నగరంలోని స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.సూర్యచంద్రరావు అధ్యక్షతన మొదటి సంవత్సరం విద్యార్ధులకు నిర్వహించిన స్టూడెంట్‌ ఇండక్షన్‌ కార్యక్రమంలో మిషన్‌ చంద్రయాన్‌-3పై అవగాహన కల్పించారు. అకడమిక్‌ కో-ఆర్డినేటర్‌ సిహెచ్‌.కృష్ణారావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.శంకరనారాయణ, ఐక్యూఎసి కో-ఆర్డినేటర్‌ ఎస్‌.పద్మావతి, హిస్టరీ అధ్యాపకులు ఎన్‌.చిన్నారావు పాల్గొన్నారు.
సోంపేట : చంద్రయాన్‌-3 విజయవంతపై సంస్కార భారతి విద్యా సంస్థల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ దాసు, చైర్మన్‌ దేవరాజు, డైరెక్టర్‌ శ్రీనుబాబు, ప్రిన్సిపాల్‌ బి.శ్రీరామ్మూర్తి, బి.కవిబాబు, ఎఒ పాపారావు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్‌ ఆధ్వర్యాన చంద్రయాన్‌-3 విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత, బాలుర ఉన్నత పాఠశాలల విద్యార్థులతో పాటు మహర్షి విద్యానికేతన్‌, వివేకానంద విద్యా కేంద్ర శిశుమందిర్‌, శ్రీకుమార్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులంతా జాతీయ పతాకాలను పట్టుకొని నినాదాలు చేశారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు, డాక్టర్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం : చంద్రయాన్‌-3 విజయవంతంపై పట్టణంలోని స్వర్ణభారతి, శాంతినికేతిన విద్యా సంస్థల విద్యార్థులు పురవీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్వర్ణభారతి విద్యా సంస్థ చైర్మన్‌ చాట్ల తులసీదాస్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే శాంతినికేతన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ దక్కత కృష్ణమూర్తిరెడ్డి ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్వర్ణభారతి విద్యాసంస్థల కో-ఆర్డినేటర్‌ చాట్ల నీలమరెడ్డి, ప్రిన్సిపాల్‌ ఆసి గౌరీశంకర్‌, ఉపాధ్యాయులు రమేష్‌, శాంతినికేతన్‌ విద్యా సంస్థల అధ్యాపకులు కె.సి.పూర్తి, సురేఖ, పద్మజ పాల్గొన్నారు.
మదర్‌ థెరీసా...
పలాస: చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో పలాస మదర్‌ థెరిసా ప్రయివేటు పాఠశాల విద్యార్థులు చంద్రయాన్‌-3 అక్షరాల రూపంలో కూర్చున్నారు. కార్యక్ర మంలో పాఠశాల కరస్పాండెంట్‌ వజ్జ గంగా భవాని, ఇన్‌ఛార్జి ప్రసాదరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.