వరండాపుట్టులో అనారోగ్యంగా బాలుడు మృతి
జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత
మృగ్యమైన వైద్యసేవలపై సర్పంచ్ మండిపాటు
ప్రజాశక్తి -ముంచింగిపుట్టు : అల్లూరి మన్యంలో శిశుమరణాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యసేవలు అందుబాటులో లేకపోవడం, తీరా జిల్లా కేంద్ర ఆసుపత్రికి, ఇతర ఉన్నత ఆసుపత్రులకు తరలించే సరికి, అప్పటికే ఆరోగ్యం విషమించడంతో మృత్యవాత పడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీ వరండాపుట్టుకు చెందిన ఎనిమిది నెలల బాలుడు పాడేరు జిల్లా కేంద్ర ఆసుపత్రిలోశుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. మన్యంలో మృగ్యమౌతున్న వైద్యసేవలపై గిరిజనం మండిపడుతున్నారు. వివరాలివి.
మండలంలోని దారెల పంచాయితీ వరండాపుట్టు గ్రామానికి చెందిన కొర్ర నీలకంఠం లక్ష్మి దంపతుల ఎనిమిది నెలల బాబు అనారోగ్యంతో బాధపడుతూ, ముంచింగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా, అక్కడ వైద్య సిబ్బంది కొరత కారణంగా మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో బాలుడిని పాడేరు ఆసుపత్రిలో చేర్చించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం మృత్యువాత పడ్డారు. బాలుడి మరణంపై గిరిజన దంపతులు, వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని వారి స్వగ్రామం వరండాపుట్టు తరలించి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.
మృగ్యమౌతున్న వైద్యసేవలపై మండిపాటు
వరండాపుట్టుకు చెందిన ఎనిమిది నెలల బాబు మృతి చెందడంపై దారెల సర్పంచ్ పాండురంగస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. పేదలకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందక మన్యవాసుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ప్రజల పక్షాన పనిచేస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకోవడం సిగ్గుచేటని వాపోయాడు.మండల పరిధిలో ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు ఉన్నా అక్కడ వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడం, సీజనల్‌గా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిసినా అవసరమైన మందులు అందుబాటులో ఉంచకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత వైఖరి వల్లే మన్యంలో జ్వరమరణాలు తరచూ జరుగుతున్నాయని, అయినా అధికారులు, పాలకులకు పట్టడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, శిశు, జ్వర మరణాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని కోరారు.










