
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీజనల్ వ్యాధుల తీవ్రత కొనసాగుతోంది. జిల్లాలో నివసిస్తున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డితోపాటు వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని కూడా జ్వరాల బారిన పడ్డారు. సిఎం జగన్ జ్వరంతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బుధవారం సాయంత్రం శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖపై లఘు చర్చకు జ్వరం కారణంగా మంత్రి రజని హాజరు కాలేకపోయారు.
రెండు జిల్లాల పరిధిలో వేలాది మంది ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం వాతావరణంలో వచ్చిన మార్పుగా అధికారులు చెబుతున్నారు. గత నెలరోజల్లో భారీగా వర్షాలు కురవడంతో పాటు దోమల తీవ్రత బాగా పెరిగింది. అంతేగాక మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు, డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నాలుగు నెలలుగా డెంగీ జ్వరాల పెరుగుదల కొనసాగుతోంది. డెంగీతో మరణాలు లేవని అధికారులు చెబుతున్నా దోమల బెడత నివారణకు ఫాగింగ్ వంటి ముఖ్యమైన చర్యలు నామమాత్రంగానైనా లేవు.
నాలుగు నెలలకాలంలో రెండు జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు డెంగీ కేసులు 140 వరకు నమోదయ్యాయి. అనధికారికంగా ఇంకా పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ జ్వర పీడితులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ జ్వరాల చికిత్సలకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు. ప్లేలేట్స్ తగ్గిపోయాయని అధిక సంఖ్యలో సొమ్ము వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే డెంగీ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. వివిధ మండలాల పరిధిలో దాదాపు 100 గ్రామాల్లో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మరోవైపు డెంగీతోపాటు ఇతర జ్వరాలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వైరల్ జ్వరాలు కనీసం మూడురోజుల వరకు ఉంటున్నాయి.
ఇటీవల కాలంలో జ్వరాలు వస్తే బాగా నీరసం, నిస్సత్తువ ఎక్కువగా ఉంటుందని పలువురు జ్వరపీడితులు వాపోతున్నారు. టైఫాయిడ్ జ్వరాల కేసులు భారీగా పెరిగాయి. కొన్ని రోజులుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా సీజనల్ జ్వరాలతో వచ్చే వారి సంఖ్య బాగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారానేరుగా వైద్యుడు, సిబ్బంది 104 వాహనంలో క్షేత్రస్థాయికి వెళ్లడం వల్ల జ్వరాలు వచ్చిన వారికి గ్రామాల్లోనే స్థానికంగా వైద్య సేవలు అందుతున్నాయి.
గ్రామాల్లో భారీ వర్షాలతో పారిశుధ్యం అధ్వానంగా మారుతోంది. గుంటూరు నగరంతోపాటు పట్టణ ప్రాంతాల్లో కూడా పారిశుధ్యం లోపం వల్ల కూడా దోమల బెడద విపరీతంగా పెరిగింది. డ్రెయిన్లు సరిగాలేక వర్షాలకు మురుగునీరు రోడ్లపైకి ఏరులై పారుతోంది. రోడ్లు అధ్వానంగా మారడంతో గుంతలలోకి వర్షపు నీరు చేరి దోమలకు కాసారాలుగా మారుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య మెరుగుదలకు దోమల బెడద నివారణకు తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉంది.