Apr 23,2023 22:59

ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి వాతావరణంలో మార్పులు కారణంగా అనేకమంది జ్వరాలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలో వేడి కారణంగా వచ్చే జ్వరాలు అధికమవుతు ప్రజలన కలవర పెడుతున్నాయి. రోజుల తరబడి దగ్గు, జలుబు, గొంతు నొప్పి వేది óస్తుండడంతో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడు తున్నాయి. అవుట్‌ పేషెంట్లు సైతం క్రమేణా అన్నిచోట్లా పెరుగుతున్నారు.ల ఈ వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కాకినాడ జిజిహెచ్‌ తోపాటు పిఠాపురం, పెద్దాపురం వంటి సీహెచ్‌ సీలు, తుని ఏరియా ఆసుపత్రులు, వివిధ ప్రాంతాల్లోనే పీహెచ్‌ సీలకు రోగుల తాకిడి పెరుగుతోంది. జ్వరం, జలుబుతో ఎక్కువగా వైద్యం కోసం వస్తున్నారు. వైద్యులు పరీక్షలు చేసి అందరికీ మందులు ఇస్తున్నారు. అయితే వారం,10 రోజుల వరకూ జ్వరం తగ్గడం లేదు. ఎండలు మండుతున్న వేళ ఉపశమనం కోసం అందరూ శీతల పానీయాలను సేవిస్తున్నారు. విచ్చలవిడిగా అమ్ముతున్న ఐస్‌ పానీయాలు, కూలింగ్‌ వాటర్‌, కూల్‌ డ్రిక్స్‌ తాగుతుండడం వల్ల దగ్గు, జలుబు వస్తున్నాయి. కొందరు ఇళ్ల వద్దే ఎండలకు భయపడి ఆసుపత్రులకు వెళ్లడం లేదు.దీంతో రోజులు తరబడి జ్వరం, జలుబుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రత ఎక్కువైనప్పుడే కొందరు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
వాతావరణంలో అతి వేడి వలన అప్పుడే పుట్టిన పిల్లలందరికీ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని పెద్దాపురం సిహెచ్‌సి ఆస్పత్రి చంటి పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్‌ బి.విజయ శేఖర్‌ తెలిపారు. ఈ సమయంలో చంటి పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఫ్లూ లక్షణాలతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఐదు ఇళ్లల్లో ఒకరికి కచ్చితంగా ఈ లక్షణాలతో ఆసుపత్రులకు వెళుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ లక్షణాలు ఉంటే గనక వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలని డాక్టర్లు కోరుతున్నారు. వంద డిగ్రీల పైబడి జ్వరం ఉంటే వెంటనే ఆస్పత్రిలో చూపించుకోవాలి. ఎక్కువ రోజులుగా దగ్గు, కఫం పడడం, తీవ్ర గొంతు నొప్పి ఉండడం ఫ్లూ లక్షణాలుగా హెచ్చరిస్తున్నారు. ఎక్కువ కాలం జలుబు వచ్చినా. తేలిగ్గా తీసుకోవద్దని చెబుతున్నారు.జ్వరానికి తోడు శ్వాసకోశ సమస్యలు, ఆయాసం వస్తే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాల్సి ఉంది. శారీరక పరిశుభ్రత పాటించడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, కాచి చల్లార్చిన నీటిని తాగటం వలన వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.