Aug 02,2023 23:22

జ్వరాల బారిన జనం

- వాతావరణంలో మార్పులతో ప్రబలుతున్న వ్యాధులు
- ఏ జ్వరమో తెలియక ఆస్పత్రులకు పరుగులు
- లెక్కలోకి రాని ప్రయివేట్‌ ఆస్పత్రుల్లోని కేసులు
- పరీక్షల పేరుతో జ్వర పీడితుల జేబులు గుల్ల
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జ్వరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సాధారణ జ్వరాలతో పాటు టైఫాయిడ్‌, డెంగీ, మలేరియా కేసులూ నమోదవుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో జ్వర పీడితులే ఎక్కువగా ఉంటున్నారు. పిహెచ్‌సిల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. వైద్యారోగ్యశాఖ అధికారులు పెద్దగా కేసులు లేవని చెప్తున్నా, ప్రయివేట్‌ ఆస్పత్రులకు వస్తున్న వారు మాత్రం డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా లక్షణాలతో వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. ఇదే అదునుగా ప్రయివేట్‌ ఆస్పత్రులు అధికంగా డబ్బులు వసూలు చేయడంతో, జ్వర పీడితుల జేబులు గుల్లవుతున్నాయి.
జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 13 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు. మలేరియా కేసులు ఏడు వరకు వచ్చాయని అంటున్నారు. ఇవి కేవలం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న వారి లెక్కలుగానే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రయివేట్‌ ఆస్పత్రులు, ఆర్‌ఎంపిల ప్రథమ చికిత్స కేంద్రాలు జ్వర పీడితుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. జ్వరాలు ప్రబలుతుండడంతో అది ఏ జ్వరమో తెలియక చాలామంది రోగులు పరీక్షల కోసం ప్రయివేట్‌ ల్యాబ్‌లకు వెళ్తున్నారు. ఇదే అదనుగా కేంద్రాల నిర్వాహకులు అయిన కాడికి దండుకుంటున్నారు. వాస్తవంగా డెంగీ నిర్ధారణ చేయాలంటే ఎలీసా పరీక్ష చేయాలి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, టెక్కలిలోని జిల్లా కేంద్రాస్పత్రిలోనే చేస్తున్నారు. ఇది తెలియక గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రయివేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఎలీసా పరీక్షలు ఎక్కడ చేస్తారనే దానిపై అధికారులు విస్తృత అవగాహన కల్పించకపోవడంతో, ప్రజలు ప్రయివేట్‌ ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలోని సమస్యలు గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు జర్వాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అనధికారికంగా పరీక్షలు
ప్రభుత్వాస్పత్రుల్లోనే పరీక్షలు నిర్వహించాలని పక్కాగా ఆదేశాలు ఉన్నా ప్రయివేట్‌ ఆస్పత్రులు, లేబొరేటరీలు అనధికారికంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జ్వరాలతో వస్తున్న వారికి కిట్‌ పరీక్షలు నిర్వహించి డెంగీగా నిర్ధారిస్తున్నారు. వాస్తవానికి కిట్‌ పరీక్షల్లో రోగ నిర్ధారణ అంత కచ్చితత్వం కాదని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ ఒకరు చెప్పారు. ఎలీసా పరీక్షతోనే డెంగీ వ్యాధిని కచ్చితంగా గుర్తించవచ్చని చెప్పారు.
డెంగీ పేరుతో అధిక ఫీజులు
పరీక్షలు ప్రభుత్వాస్పత్రుల్లో చేస్తున్నా, వైద్యం సరిగా అందుతుందా? లేదా? అన్న సందేహంతో ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. రోగుల భయాన్నే అవకాశంగా తీసుకుని ప్రయివేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులు అధిక ఫీజులతో దోపిడీ సాగిస్తున్నాయి. డెంగీ పేరుతో ప్రయివేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్లేట్‌లెట్స్‌ కోసం చిన్న చిన్న ఆస్పత్రులు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉంటే, కార్పొరేట్‌ ఆస్పత్రులు రూ.25 వేల వేరకు ఫీజులను కట్టించుకుంటున్నాయి.
గ్రామాల్లో తీరిక లేని ఆర్‌ఎంపిలు
డెంగీతో పాటు ఇతర సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా ఉండడంతో, గ్రామాల్లో ఆర్‌ఎంపిలు తీరిక లేకుండా ఉన్నారు. డెంగీకి కూడా వారే చికిత్స చేస్తున్నారు. ప్లేట్‌లెట్స్‌ పడిపోయి పరిస్థితి తీవ్రతగా ఉంటే, తమతో సంబంధాలున్న జిల్లా కేంద్రంలోని ప్రయివేట్‌ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. అప్పటికే చేతిలో డబ్బులు ఖర్చయిపోవడంతో అప్పులు చేసి ప్రయివేట్‌ ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారు.
అపారిశుధ్య పరిస్థితులూ కారణమే
గ్రామాల్లో తీవ్ర అపారిశుధ్య పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు పడుతుండంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. మలేరియా, డెంగీ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో, బల్బు పోయినా వేసుకోలేని దుస్థితిలో నెలకొంది. కొన్నిచోట్ల సర్పంచ్‌లే చేతిమదుపులు పెట్టి అత్యవసరంగా విద్యుత్‌ దీపాలు వేయిస్తున్నారు. పంచాయతీ ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో పారిశుధ్య పనులపై పెద్దగా దృష్టిసారించడం లేదు.
సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు
డెంగీ, మలేరియా నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి వారం శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులు పాటు డ్రై డే నిర్వహిస్తున్నాం. ప్రయివేట్‌ ఆస్పత్రులు సొంతంగా డెంగీ పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు. వారి దగ్గరకు ఆనుమానిత కేసులు వస్తే నిర్దారణ పరీక్షల కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన ఆస్పత్రులకు పంపాలని ప్రయివేట్‌ ఆస్పత్రులకు సూచించాం. గ్రామాల్లో డెంగీ లక్షణాలతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే గుర్తించి, శాంపిల్స్‌ను పంపించాలని పిహెచ్‌సి వైద్యులకు సూచించాం. పరీక్షలకు అవసరమైన ర్యాపిడ్‌ కిట్లను ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాం.
- పి.వి సత్యనారాయణ, జిల్లా మలేరియా నివారణ అధికారి