ప్రజాశక్తి - మక్కువ : మండలంలోని ఎర్ర సామంతవలస గిరిజన ఆశ్రమం పాఠశాల విద్యార్థులను జ్వరాల బారి నుండి కాపాడాలని తక్షణమే రక్షిత మంచినీటి పథకాన్ని బాగు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు తాడంగి ప్రభాకర్‌రావు, శ్రీధరపు బిరుసు, కొల్లి గంగనాయుడు ఆశ్రమ పాఠశాలను గురువారం సందర్శించి జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ఆశ్రమం పాఠశాలలో చదువుతున్న బిడ్డిక మహేంద్ర చనిపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇప్పటికీ సీదరపు వరుణ్, మచ్చ దావీదు, మండంగి సంతోష్, చింత చిన్న, సీదరపు తేజ జ్వరంతో బాధపడుతూ మంచాలపై ఉన్నారని అన్నారు. వీరే కాకుండా మరి కొంతమందిని విద్యార్థులు దోకిశీల పిహెచ్‌సికి చికిత్స కోసం తీసుకెళ్లినట్టు విద్యార్థులు తెలిపారు. వీరే కాకుండా ప్రతిరోజు 10 మందికి తక్కువ కాకుండా జ్వరాల బారిన విద్యార్థులు పడుతున్నారన్నారు. అలాగే ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఎర్రసామంతవలసలో ఆశ్రమ పాఠశాలలో ఉన్న వాటర్ ప్లాంట్ సక్రమంగా పనిచేయడం లేదని ఆ నీరు తాగడం వల్ల టైఫాయిడ్ ,మలేరియా, జ్వరాలు బారిన పడుతున్నారని అన్నారు. అలాగే వంట చేయడానికి శాశ్వత ప్రాతిపదికన ఒక కుక్కు మాత్రమే ఉన్నారని మిగిలిన సిబ్బంది ఎవరూ లేరన్నారు. ప్రతి గిరిజన ఆశ్రమం పాఠశాలకు శాశ్వత ప్రాతిపదికన ఎఎన్‌ఎంను నియమించాలని, అన్ని రకాల మందులు సరఫరా చేయాలని, పిహెచ్‌సికి తీసుకెళ్లడానికి రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై శుక్రవారం ఐటిడిఎ పిఒ, డిప్యూటీ డిఎంహెచ్‌ఒకు వినతిని అందజేస్తామన్నారు. అలాగే మృతి చెందిన మహేందర్ కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు విద్యార్థి మహేందర్ కుటుంబాన్ని నంద గ్రామం వెళ్లి నాయకులు సందర్శించి వారిని ఓదార్చారు.










