
సింహగిరి మారుమూలన ఉన్న ఒక గ్రామం. ఆ ఊరి ప్రజల్లో విద్య తక్కువ. మూఢనమ్మకాలు ఎక్కువ !
కేశవయ్య అనే కిరాణ వ్యాపారి అంగడి పెట్టుకునేందుకు సింహగిరికి వచ్చాడు. వచ్చిన పది రోజుల్లోనే అక్కడి ప్రజల్లో మూఢనమ్మకాలు ఎక్కువనీ, అమాయకులనీ గ్రహించాడు. వాళ్ల మూఢ నమ్మకాలనీ, అమాయకత్వాన్నీ ఉపయోగించుకుని, పెట్టుబడిలేని వ్యాపారంతో బాగా సంపాదించాలనే దుష్ట ఆలోచన చేశాడు.
అదును చూసుకుని ఒకరోజు రచ్చబండ వద్ద మాట్లాడుకుంటున్న కొందరిని కలిశాడు. తాను హిమాలయాల్లో ఓ గురువు వద్ద పూజలతో కష్టాలు తీర్చే విద్యలు నేర్చుకున్నానని, ఏ కష్టానికైనా తాను పూజ చేస్తానని, వానల కోసం 'వానపూజ', పంటల కోసం 'పంటపూజ', వ్యాపారంలో నష్టం వస్తే 'వ్యాపార పూజ', ధనం కోసం 'ధనపూజ' చేస్తానని చెప్పి నమ్మించాడు.
అమాయకులైన ఊరి ప్రజల్లో ఓ కుటుంబం డబ్బుకోసం 'ధనపూజ' చేయించుకున్నారు. దానికి కేశవయ్య వెయ్యి రూపాయలు వసూలు చేశాడు.
ఆ సంవత్సరం అనుకున్నంత వానలు పడలేదు. ఊరి పెద్దలకు ఈ మాట ఆమాట చెప్పి అందరి దగ్గరా డబ్బులు వసూలు చేసి, 'వానపూజ' చేశాడు! అయినా వానలు పడలేదు. కొందరు ఊరివాళ్లు 'మీరు పూజలు చేసినా వానలు పడలేదేమిటి?' అని అడిగారు.
వారికి ఏవో మోసపూరిత మాటలు చెప్పి నమ్మించాడు.
ఇదిలా ఉండగా సింహగిరికి చెందిన రవి గురుకులంలో వైద్యవిద్య నేర్చుకుని వస్తాడు. అతని స్నేహితుడు సోముతో మాట్లాడుతున్నప్పుడు కేశవయ్య పూజల గురించి వివరించాడు. ఊరి ప్రజల్ని నమ్మించి, బాగా మోసం చేస్తున్నట్లు గ్రహిస్తాడు రవి. అతనికి తగిన సమయంలో బుద్ధి చెప్పి, ఊరి ప్రజల్లో మూఢనమ్మకాలు తొలగించాలని నిశ్చయించాడు.
ఓ రోజు కేశవయ్య కొడుక్కి విపరీతమైన జ్వరం వస్తుంది. తన మంత్రాలు, పూజలు పని చెయ్యవని తెలిసిన కేశవయ్య, కొడుకుని మంచి వైద్యుడికి చూపించాలనుకుంటాడు.
వెంటనే గ్రామ పెద్ద వద్దకు వెళ్లి 'మంచివైద్యుడు ఊరిలో ఉన్నాడా? నా కొడుక్కి జ్వరంగా ఉంది' అని అడిగాడు కేశవయ్య.
'నీవు ప్రతి కష్టానికీ పూజ చేస్తావు కదా! మరి నీ దగ్గర ''జ్వరపూజ'' లేదా?' అడుగుతాడు గ్రామపెద్ద.
'హిమాలయాల్లో నేను జ్వరపూజ నేర్చుకోలేదు' అని అబద్ధం చెప్తాడు.
'ఊర్లో రవి అనే యువకుడు మంచి గురుకులంలో వైద్యవిద్య నేర్చుకొచ్చాడు. నీ కొడుకుని బండిపై తీసుకురా, అతని వద్దకు వెళదాం' అని గ్రామపెద్ద అంటాడు.
కేశవయ్య పరుగున ఇంటికి వెళ్లి, కొడుకును బండిపై గ్రామపెద్దతో కలిసి రవి వద్దకు తీసుకెళ్తాడు.
'లోపల పడుకోబెట్టండి' అని చెప్పి అబ్బాయిని పరీక్షిస్తాడు రవి. అనంతరం కేశవయ్యతో 'మీ అబ్బాయికి జ్వరం ముదిరింది, 'జ్వరపూజ' చెయ్యాలి, అందుకు రెండు వేలు ఖర్చు అవుతుంది' అని చిరునవ్వుతో చెప్తాడు.
రవి చెప్పిన మాటలకు కేశవయ్య గుండెలో రాయి పడుతుంది.
'ఏమిటి జ్వరపూజకు అంత డబ్బా?' అని అడుగుతాడు కేశవయ్య.
'మీకు పూజల విలువ బాగా తెలుసు, వాన పూజకు, పంట పూజకు ధన పూజకు అంతంత వసూలు చేస్తున్నారు. మరి ఇది ప్రాణానికి సంబంధించిన 'జ్వరపూజ' ఆ మాత్రం ఉంటుంది. పూజ చేసి పిల్లవాడికి జ్వరం పూర్తిగా తగ్గిస్తాను, నన్ను నమ్ముకోండి' అని చెప్తాడు.
రవి తన మోసాన్ని గ్రహించినట్లు తెలుసుకుంటాడు కేశవయ్య. రవి చిన్న పూజ చేసినట్లు నటించి, వైద్య విద్యలో నేర్చుకున్న ఆకు పసరు తెచ్చి, ఆ అబ్బాయి చేత తాగిస్తాడు. ఓ గంట తరువాత కేశవయ్య కొడుక్కి జ్వరం తగ్గుతుంది. కేశవయ్య రవికి దండం పెట్టి, రెండువేలు ఇస్తాడు.
రవి చిరునవ్వుతో అందులోంచి రెండొందలు మాత్రం తీసుకుని, మిగతా డబ్బు తిరిగి ఇచ్చేస్తాడు. దానికి కేశవయ్య ఆశ్చర్యపోతాడు.
దానికి గ్రామపెద్ద సమక్షంలో రవి ఈ విధంగా చెప్తాడు. 'చూడండి కేశవయ్య గారూ, మీరు చేసే పూజల గురించి నా స్నేహితుడు సోము వివరించాడు. మా ఊరి ప్రజలు అమాయకులు, చదువు లేకపోవడం వల్ల మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. మీరు పూజల పేరుతో వారిని మోసం చేస్తున్నారు. అది చాలా తప్పు, డబ్బు న్యాయంగా సంపాదించాలి తప్ప, మోసం చేసికాదు. మీ మోసం ప్రజలు తెలుసుకున్నప్పుడు మీ కుటుంబ భవిష్యత్తు అంధకారం అవుతుంది గమనించండి' అని వివరిస్తాడు రవి.
కళ్లలో నీళ్లతో నమస్కారం పెట్టి రవికి, గ్రామపెద్దకి ఈ విధంగా చెప్తాడు. 'నన్ను క్షమించండి, డబ్బుకోసం గడ్డి తిన్నాను. ఈ ఊరి అమాయకుల్ని మోసగించాను. ఇక మీదట ఏ పూజా చేయను. కిరాణం అంగడి పెట్టుకుని, నా వంతు ఊరి ప్రజలకు మేలు చేస్తాను'. అని గ్రామపెద్ద చేతులు పట్టుకుంటాడు. కేశవయ్యలో వచ్చిన మార్పుకి రవి గ్రామపెద్ద సంతోషిస్తారు.
మరుసటి రోజే రవి, గ్రామపెద్ద కలిసి సభ ఏర్పాటుచేసి, మూఢనమ్మకాలను పారదోలే విధంగా ఉపన్యాసం ఇస్తారు.
వానలు బాగా పడాలంటే చెట్లు బాగా పెంచాలని, రోగం వస్తే మంచి వైద్యుడి వద్దకు వెళ్లాలని, డబ్బు బాగా సంపాదించాలంటే చక్కని ప్రణాళికతో కష్టపడాలని, పంటలు బాగా పండాలంటే మంచి విత్తనాలు, ఎరువులు వెయ్యాలని చెప్పి, ప్రజలను చైతన్య పరుస్తాడు రవి. గ్రహించిన ఊరి ప్రజలు అప్పటి నుండి మూఢనమ్మకాలు మాని, పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని నిర్ణయం తీసుకుంటారు.
కంచనపల్లి వేంకట కృష్ణారావు
93486 11445