ప్రజాశక్తి -అనకాపల్లి
ఆర్మీ జవాన్‌పై దురుసుగా ప్రవర్తించిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ, అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్‌లో గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 7న పరవాడ పోలీస్ స్టేషన్ సిబ్బంది బి.శోభ, ఎం.ముత్యాల నాయుడు కలిసి పోలీస్ యూనిఫామ్‌లో పరవాడ సంతబయలు జంక్షన్ వద్ద దిశా యాప్ డౌన్లోడ్ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఆ సమయంలో ఎలమంచిలి మండలం రేగుపాలెం గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీలో నాయక్‌గా పని చేస్తున్న సయ్యద్ అలీముల్లాను పోలీసులు మొబైల్ ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ చేయమని కోరగా డౌన్లోడ్ చేసి వచ్చిన ఓటిపి నెంబర్ చెప్పమన్నారని, దీంతో ఆర్మీ ఉద్యోగి ఓటిపి ఎందుకు నోట్ చేసుకుంటున్నారని, అసలు మీరు పోలీసులేనా లేదా దొంగపోలీసులా, మీ ఐడి కార్డు చూపించమని కోరినట్లు తెలిపారు. దీనికి ఆగ్రహించిన పోలీస్ సిబ్బంది అతనిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా, సదరు వ్యక్తి పెనుగులాడి తానేమీ తప్పు చేయలేదు పోలీస్ స్టేషన్‌కు రానని ప్రతిఘటించారని పేర్కొన్నారు. దీంతో మరో ఇద్దరు పోలీసులను రప్పించి నలుగురు పోలీసులు కలిసి సదరు వ్యక్తిని బలవంతంగా ఆటోలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. కొంతమంది వీడియోలో ఆ సంఘటనను చిత్రీకరించారన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అనకాపల్లి జిల్లా ఎస్పీ కెవి.మురళీకృష్ణ ఆర్మీ ఉద్యోగిని పిలిపించి విషయం తెలుసుకుని, పై నలుగురు పోలీస్ సిబ్బందిని ఆర్మ్డ్ రిజర్వ్‌కు అటాచ్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సంఘటనపై డిజిపి ఆదేశాల మేరకు నలుగురు పోలీస్ సిబ్బందిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఇటువంటి సంఘటనులు మళ్లీ పునరావృతం కాకుండా అనకాపల్లి జిల్లా పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చామని పేర్కొన్నారు.