చలికాలంలో జుట్టు ఊడే సమస్య చాలామందిలో కనిపిస్తుంది. ఆ సమస్యను అధిగమించడానికి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు.
కొందరు రోజూ తలస్నానం చేస్తూ ఉంటారు. కొన్నాళ్లకు షాంపూల ప్రభావం ఎక్కువవుతుంది. మాడుపై ఉండే సహజ నూనెలు ( Natural Oils on Scalp ) పోయి జుట్టు ఎండుగడ్డిలా మారుతుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే తక్కువ గాఢత లేదా పీహెచ్ 5.5 ఉన్న నాణ్యమైన షాంపూతో రెండ్రోజులకోసారి తలస్నానం చేస్తే సరిపోతుంది.
కనీసం వారానికి ఒకసారైనా గోరువెచ్చని స్వచ్ఛమైన కొబ్బరినూనెతో తలకు మర్దన చేసుకోవడం తప్పనిసరి.
తలస్నానం చేసి వచ్చిన వెంటనే కొందరు జుట్టు దువ్వుకుంటుంటారు. అలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడే ప్రమాదం ఉంది. పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకొని, ఆ తర్వాత జెల్ రాసుకుంటే ఆ ఇబ్బంది కొంతమేరకు తగ్గించిన వాళ్లు అవుతారు.
కొందరికి రాత్రి పడుకునే ముందు జుట్టుకు నూనె రాసుకునే అలవాటు ఉంటుంది. మరునాడు తెల్లవారి లేవగానే తలస్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. జుట్టుకు నూనె రాసుకుని ఆ తర్వాత రెండు గంటలకు తలస్నానం చేయడం మంచిది.
కొందరు స్టైల్ కోసం జుట్టు అందంగా కనిపించడం కోసం మార్కెట్‌లో లభించే జెల్స్ వాడుతుంటారు. వాటిని వాడడం వల్ల అప్పటికప్పుడు జుట్టు అందంగా కనిపించినా జుట్టు రాలడం మొదలవుతుంది. రసాయనాలతో కూడిన జెల్స్ వాడకపోవడమే మంచిది.
కొందరు జుట్టును వదిలేస్తారు. చిన్న జుట్టు అయితే ఫర్వాలేదుగానీ, పొడుగు జుట్టు చిక్కులుపడి, జుట్టు ఊడిపోతుంది.