ప్రజాశక్తి - ఆరిలోవ : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో ఐఒసిఎల్ ఆర్ధికసాయంతో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎస్‌ఇఎర్‌పిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జంజరుకుమార్.వి, టిఎపిఎస్‌ఒ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ ముఖ్యఅతిధులుగా పాల్గొనగా, డిఎఫ్‌ఒ అనంత శంకర్, క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియాతో కలిసి ఖడ్గమృగం అదనపు నైట్‌హౌస్, హిమాలయన్ బ్లాక్ బేర్ నూతన నైట్ హౌస్, బయోస్కోపు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధులు మాట్లాడుతూ పర్యావరణహితమైన కార్యక్రమాలు చేపట్టేందుకు ఐఒసిఎల్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అందులో భాగంగానే జూ పార్కులో అభివృద్ధి పనులకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. అనంతరం జూ పార్కులో నూతనంగా జన్మించిన అడవి దున్న, హిమాలియన్ గోరల్, తోడేలు పిల్లలకు నామకరణ చేశారు. అడవి దున్న పిల్లలకు సిసిఎఫ్ పి.రామ్మోహన్‌రావు లక్కీడీప్ ద్వారా మగ అడవి దున్న పిల్లకు భీమ్, ఆడ దున్న పిల్లలకు హన్సిక, అక్షితగా నామకరణ చేసారు. తోడేలు పిల్లలకు సంజరు కుమార్ గౌతమి, శ్రీదేవి, అనంత లకీëలుగాను, మరో మూడు మగ తోడేలు పిల్లలకు అనిల్, గౌతమ్, అనంత్‌లుగా నామకరణం చేసారు. హిమాలియన్ గోరల్ ఆడ పిల్లకు అనిల్‌కుమార్ గిరిజగా నామకరణం చేసారు.










