ప్రజాశక్తి-అరకులోయ:అరకులోయ నియోజక వర్గం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల చెందిన స్థలాలను పరిరక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ సహాయ కార్యదర్శి పి రామన్న డిమాండ్ చేశారు. ఆక్రమణకు గురి అవుతున్న జూనియర్ కళాశాల స్థలాలను ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ బృందంతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, అరకులోయ మండలం పెదలబుడు మేజర్ పంచాయతీ పరిధి అరకులోయలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గతంలో ప్రభుత్వం 8ఎకరాలు 50 సెంట్లు భూములు కేటాయించిందని తెలిపారు.ఈ భూములకు రక్షణ లేక పోవడంతో రాను రాను ఆక్రమణకు గురవుతుందని ఆయన అన్నారు. ఆక్రమణలను అరికట్టడంలో రెవెన్యూ, పంచాయతీ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కళాశాల స్థలం కబ్జాకు గురి అవుతుందని ఎస్‌ఎఫ్‌ఐ గతంలో పోరాటాలు చేయడంతో ఫలితంగా నాడు నేడు ద్వారా ఇటీవల రూ. 1 కోటి 30 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరు అయిందన్నారు. ఈ నిధులతో కళాశాల భవనాల నిర్మాణం, పాత భవనాలు మరమ్మత్తులు, మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడ నిర్మాణం వంటి పనులు చేయవలసి ఉండగా, కళాశాల చుట్టూ ప్రహరీ గోడల పిల్లర్స్ వేసి పన్నులు ఆపివేయడంతో పరిస్థితి మొదటికి వచ్చిందన్నారు. పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి ఐసు బాబు, కమిటీ సభ్యులు. పి రాజు, జూనియర్ కళాశాల ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బి సంపత్, టి.మనోహర్, ఎస్. చరణ్ కళాశాల విద్యార్థులు ఎస్ నాగేష్, సాయి కృష్ణ, జె.సందీప్, టి.లోకేష్ తదితరులు పాల్గొన్నారు.










