శ్రీయుద్ధప్రాతిపదికన కాలువల మరమ్మతులు
శ్రీజిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీదిరి అప్పలరాజు
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి సాగు నీటిని విడుదల చేయాలని నీటిపారుదల సలహా మండలి (ఐఎబి) సమావేశంలో నిర్ణయించినట్టు కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పశు సంవర్థక పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశంతో పాటు జిల్లా సమీక్షా కమిటీ (డిఆర్‌సి) సమావేశం మంత్రి అధ్యక్షతన నిర్వహించారు.
రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపి వంగా గీత, జడ్‌పి ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, ఎపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలా క్కియా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్.మహేష్ కుమార్ కలిసి జిల్లాలో వివిధ కార్యక్రమాల అమలు పురోగతిని సమీక్షించారు.ఎంఎల్‌సిలు చిక్కాల రామచంద్రరావు, ఐ.వెంకటేశ్వరరావు, అనంత ఉదరు భాస్కర్, కాకినాడ రూరల్, అర్బన్, జగ్గంపేట, పెద్దాపురం ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జ్యోతుల చంటిబాబు, నిమ్మకా యల చిన్నరాజాప్ప, జిల్లా అటవీ శాఖ అధికారి ఐవీకె రాజు, డిఆర్‌ఒ కె.శ్రీధరరెడ్డి, కాకినాడ, పెద్దాపురం ఆర్‌డిఒలు బి.వెంక టరమణ, జె.సీతారామారావు, తహశీల్దారులు హాజరయ్యారు.
ప్రధానంగా ఖరీఫ్-2023కు సాగునీటి ప్రణాళిక, కాలువల వ్యవస్థ మరమ్మతులు, అభివృద్ధి, ఏలేరు వ్యవస్థ పనులు, రబీ ధాన్యం సేకరణ, వేసవి తాగునీటి ప్రణాళిక, ఆసుపత్రుల్లో వైద్య సేవలు తదితరాలపై చర్చించాది. తొలుత జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జి.శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఖరీఫ్-2023కు భారీ, మధ్యతరహా, మైనర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణ స్థితిగతులను వివరించారు. వివిధ నియోజకవర్గాల్లో రూ.3.93 కోట్లతో ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నట్టు వివరించారు. కాలువల మూసివేత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అత్యంత ప్రాధాన్యమున్న పనులను పూర్తి చేయాలని సభ్యులు కోరగా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించి నీటి విడుదల నాటికి కాలువ వ్యవస్థలను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచనున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. గుర్రపుడెక్క, పూడిక తొలగింపుతో పాటు ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
బొండాలు రకం వరి కొనుగోలు చేస్తాం
రబీ సీజన్‌కు సంబంధించి బొండాలు రకం ధాన్యం కొనుగోళ్లపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోందని, బొండాలు రకం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
తాగునీటి సమస్యపై చర్చ
వేసవి తాగునీటి ప్రణాళికపై జరిగిన చర్చ సందర్భంగా ఇప్పటికే 15 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు గాను 10 చెరువులను పూర్తిస్థాయిలో నింపామని.. మిగిలిన చెరువులను వారం రోజుల్లో నింపడం పూర్తవుతుందని గ్రామీణ నీటి సరఫరా అధికారులు వివరించారు. పిఠాపురం టౌన్ కెనాల్ ఆధునికీకరణ పనులతో పాటు శివారు భూములకు సైతం సాగునీరు అందేలా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంపి వంగా గీత సమావేశంలో చర్చించారు.
దళారుల ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోళ్లు
మంత్రి అప్పలరాజు
దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రబీ ధాన్యం కొనుగోలు పూర్తి పారదర్శకంగా చేస్తామని కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పశు సంవర్థక పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. నీటిపారుదల సలహా మండలి (ఐఎబి), జిల్లా సమీక్షా కమిటీ (డిఆర్‌సి) సమావేశాల అనంతరం ఆయన వీడియాతో మాట్లాడారు. అక్టోబర్, నవంబర్‌లోని తుపాన్లకు పంట దొరక్కుండా ఉండేందుకు ముందుగానే అంటే జూన్ 1వ తేదీనే నీటిని విడుదల చేసి ఖరీఫ్ పంట ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది అంచనాలకు మించి 20 నుంచి 25 శాతం మేర దిగుబడి పెరిగిందన్నారు. ఈసారి కూడా చివరి ఎకరా వరకూ సాగునీరు పూర్తి స్థాయిలో అందిస్తామని స్పష్టం చేశారు. కాలువల మూసివేత సమయంలో కాలువల్లో పూడకతీత, గుర్రపుడెక్క తొలగింపునకు, మరమ్మతులకు చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు. నాటుసారా, గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలిస్తున్నట్టు వెల్లడించారు. నాడు-నేడు విధానంలో ప్రభుత్వ పాఠశాలలను, ఆసుపత్రులను అభివద్ధి చేసినట్లు వివరించారు. నవరత్నాలు ద్వారా సమాజంలోని పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు.
నిరుపేదలకు పట్టా భూములు
ప్రజాశక్తి - కాకినాడ
రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు పట్టాభూముల కల్పన ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచి సామాజిక గౌరవం, హౌదా కల్పిస్తోందని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కోర్టు హాలులో జిల్లా ఎస్సైన్‌మెంట్ కమిటీ సమావేశం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్య్స శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షులుగా, జిల్లా కలెక్టర్, ఎంఎల్‌ఎలు, ఆర్‌డిఒలు సభ్యులుగా, జాయింట్ కలెక్టర్ కన్వీనర్‌గా ఏర్పాటైన ఈ కమిటీ జిల్లాలో అర్హులైన భూమి లేని నిరు పేదలకు, శివాయి జమేదారులకు భూముల పంపిణీ అంశాలను సమావేశంలో సమీక్షించింది. జిల్లాలోని తుని, కిర్లంపూడి, కోటనందూరు, జగ్గంపేట, శంఖవరం, రౌతులపూడి, ప్రత్తిపాడు మండలాల్లోని గుర్తించిన లబ్దిదారులు, భూముల వివరాలను జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా సభ్యులకు వివరించారు. ఈ 7 మండలాల పరిధిలోని 57 గ్రామాల్లో గుర్తించిన 2,949.66 ఎకరాల అనువైన భూములను, అర్హులుగా గర్తించిన 3,638 మంది లబ్దిదారుల పంపిణీ చేసేందుకు సమావేశంలో కమిటీ ఆమోదం జారీ చేసింది. ఈ భూముల పట్టాలను ఎంపిక చేసిన లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్థేశాల ప్రకారం మే రెండవ వారంలో లబ్దిదా రులకు పంపిణీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ కతికా శుక్లా తెలియజేశారు. కమిటీ సమావేశాన్ని తరచుగా నిర్వహించి అర్హులైన పేదలకు భూముల పంపణీకి ప్రతిపాదించాలని కమిటీ చైర్మన్‌గా సీదిరి అప్పలరాజు సూచించారు. అలాగే నిరుపేదలకు కూడా అందుబాటులో ఉన్నచోట్ల భూమి పంపి ణీకి అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు.










