May 12,2023 21:05

సమావేశంలో మాట్లాడుతున్న గిరీష్‌

ప్రజాశక్తి - పెద్దకడబూరు
పత్తిని సాగు చేసేందుకు జూన్‌ మాసం అనుకూలమైందని ఆదోని వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం.గిరీష్‌ తెలిపారు. శుక్రవారం పెద్దకడబూరులోని రైతు భరోసా కేంద్రంలో ఎఒ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరీష్‌, సలహా మండలి సభ్యులు, పెద్దకడబూరు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్వేత, ఇందు మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌లో అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడానికి ఈనెల 15 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. భూ యజమాని తన పొలం సాగు చేసుకునే కౌలుదారులకు కౌలు పత్రం పొందడానికి అవసరమయ్యే అంగీకార పత్రంపై సంతకం చేసి కౌలు రైతులకు సహకరించాలని కోరారు. పత్తి విత్తనాలు నాటుకోవడానికి మే నెల అనుకూలమైందని కాదని, జూన్‌లో నేల పూర్తిగా చల్లబడిన తర్వాత మాత్రమే విత్తనాలు నాటుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పాల్సిన ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లో రైతులు ఉచితంగా విత్తన పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. రైతులు పండించిన సొంత విత్తనం కానీ, విత్తన దుకాణాల్లో కొన్నా పరీక్ష నిమిత్తం ఆదోనిలోని పరీక్ష కేంద్రానికి పంపవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధిత రైతు భరోసా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలన్నారు. అనంతరం ఎఒ వరప్రసాద్‌ మాట్లాడారు. ఈనెల చివరి వారంలో విడుదలయ్యే రైతు భరోసా లబ్ధిదారులు జాబితా కోసం ఆర్‌బికె సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. సామాజిక తనిఖీ నిమిత్తం జాబితా ప్రదర్శిస్తామన్నారు. ఏమైనా సమస్యలుంటే ఈనెల 15లోపు తన దృష్టికి తీసుకురావాలని కోరారు.