Jun 25,2023 20:52

సమావేశంలో మాట్లాడుతున్న యూనియన్‌ నాయకులు

 కడప అర్బన్‌ : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం జులై 10,11న నిర్వహించే 36 గంటల నిరసన జయప్రదం చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.లక్ష్మిదేవి, బి.లక్ష్మిదేవి పిలుపు నిచ్చారు. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసిడిఎస్‌కు బడ్జెట్‌లో నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. ఐసిడిఎస్‌ లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లు కుదించటానికి నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ రూ.5లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని పేర్కొన్నారు. ఆయాల ఉద్యోగోన్నతలకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని తెలిపారు. రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని చెప్పారు. కార్యకర్తలకు సమానంగా వేతనాలు ఇవ్వాలన్నారు. 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని కోరారు. టంగుటూరు మండలంలో హత్యకు గురైన అనుమాయమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అన్ని సెంటర్లకు గ్యాస్‌ సరఫరా చేయాలని పేర్కొన్నారు. నిరసనలో అంగన్‌వాడీలు, మినీ వర్కర్లు, పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.