ప్రజాశక్తి - కలిదిండి
సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో నియోజకవర్గ స్థాయి షటిల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడలు దోహదపడతాయన్నారు. కైకలూరు రూరల్ సిఐ వైవిఎల్.నాయుడు, ఎస్‌ఐ మణికుమార్, ఎంపిపి చందన ఉమామహేశ్వరరావు, సర్పంచులు మసిముక్కు మారుతీప్రసన్న, సానామీనా సరస్వతి, బత్తిన ఉమా మహేశ్వరరావు, గద్దె ఆనంద్, మహాదేవ విజయబాబు, ఎఎంసి ఛైర్మన్ ఐనాల బ్రహ్మాజీ, నాయకులు నంబూరి శ్రీదేవి, పాము వీర వెంకట రవి కుమార్, స్టేషన్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్ : నేటి యువత జూదం, కోడిపందేలు, పేకాట గుండాటలకు దూరంగా ఉండేలా సాంప్రదాయ క్రీడలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వన్‌టౌన్ సిఐ ఆదిప్రసాద్ పిలుపునిచ్చారు. వివిధ రకాలైన క్రీడా పోటీలను పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో శ్రేయస్కరమని ఆయన చెప్పారు. ఏలూరు వన్‌టౌన్ సర్కిల్ ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో గుడిపూడి రాము స్మారకార్థం నిర్వహిస్తున్న సంక్రాంతి క్రీడా సంబరాలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వారు తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఏలూరు రూరల్ ఎస్‌ఐ లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ టోర్నమెంట్ ప్రాంభించడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో చాటపర్రు గ్రామ సర్పంచి గుడిపూడి రఘు, గ్రామ ప్రజలు సుమారు 200 మంది పాల్గొన్నారు.
ముసునూరు : సంక్రాంతి పండుగ పురస్కరించుకుని సాంప్రదాయ ఆటలకు మొగ్గు చూపాలని ఎస్‌ఐ ఎం.కుటుంబరావు, ఎంపిడిఒ జి.రాణి, రెవెన్యూ తహశీల్దార్ దాసరి సుధ కబడ్డీ, వాలీబాల్ పోటీలను సోమవారం ప్రారంభించారు. మండల కేంద్రమైన ముసునూరు గ్రామంలోని చర్చి వద్ద పోటీలను ప్రారంభించిన వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి ఆటలకు దూరంగా ఉండాలన్నారు. సాంప్రదాయ ఆటలు ఆడాలని చెప్పారు. పోటీల్లో గెలుపొందినవారికి ప్రథమ, ద్వితీయ బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.
చింతలపూడి : తెలుగు సంప్రదాయ పండుగ సంక్రాంతి అని, ప్రతిఒక్కరూ పండుగ విశిష్టత గురించి అవగాహన చేసుకోవాలని చింతలపూడి తహశీల్దార్ కృష్ణజ్యోతి, ఎస్‌ఐ డి.హరికృష్ణ అన్నారు. మండలంలోని యర్రగుంటపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన సంక్రాంతి పండుగ ముద్దు జూదాలు వద్దు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో యువత జూదాలు, కోడిపందేల వైపు మొగ్గు చూపకుండా పండుగ విశిష్టత గురించి తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లోని పెద్దలు యువతకు అవగాహన కల్పించాలన్నారు. యువత పెడదోవ పట్టకుండా వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ కృష్ణజ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు పాల్గొన్నారు.
క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక వికాసానికి దోహదపడతాయని చింతలపూడి శ్రీచైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆర్‌ఐ పార్ధసారధి, కో-ఆర్డినేటర్ ఉదరుభాస్కర్, ప్రీ ప్రైమరీ ఇన్‌ఛార్జి గురవమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి : ఉన్నతాధికారుల ఆదేశానుసారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆగిరిపల్లి పోలీసుశాఖ ఆధ్వర్యంలో జూదక్రీడలు వద్దు-సంప్రదాయక్రీడలు ముద్దు అనే నినాదంలో భాగంగా ఆగిరిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలను ఆగిరిపల్లి ఎఎస్‌ఐ తావిరియా నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిడి రాందాసు, వైసిపి నాయకులు ఆర్.వెంకటనారాయణ పాల్గొన్నారు.










