ప్రజాశక్తి - ఆరిలోవ : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల ఆధ్వర్యాన ఆదివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహించారు. దీనిలో భాగంగా స్వాతంత్య్ర సమర యోధుల పేర్లును గుర్తించే విధంగా 'గెస్ ద ఫ్రీడమ్ ఫైటర్' అనే పేరుతో గేమ్‌ను నిర్వహించారు. స్వాతంత్య్ర సమర యోధులను గుర్తించి ఫొటోలతో వారి పేర్లును జతచేసేలా గేమ్ ఏర్పాటుచేశారు. ఆదివారం జూ సందర్శనకు వచ్చిన పాడేరు ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ ఈ గేమ్‌ను తిలకించి మాట్లాడారు. దేశం కోసం పోరాడిన వారిని ఈ విధంగా గుర్తు చేసుకోవడం, పిల్లలకు వారి గురించి తెలియజేసేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్వాతంత్య్ర సమర యోధుల గురించి సమాచారం తెలుసుకోవడం సంతృప్తిగా ఉందని సందర్శకులు పేర్కొన్నారు. దేశభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు జూ క్యూరేటర్ డాక్టర్ నందినీ సలారియా తెలిపారు.










