Aug 20,2023 00:54

జూ పార్కుకు తీసుకొచ్చిన ఆడ సింహం

ప్రజాశక్తి - ఆరిలోవ : జంతు మార్పిడి విధానంలో భాగంగా గుజరాత్‌లో గల నక్కర్‌బాగ్‌ జులాజికల్‌ గార్డెన్‌ నుంచి వైజాగ్‌ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలకు రెండున్నర సంవత్సరాల ఆడ సింహాన్ని తీసుకొచ్చారు. నక్కర్‌బాగ్‌ జంతు ప్రదర్శన శాల వెటర్నరీ వైద్యుడు ప్రశాంత్‌ మారు, వైజాగ్‌ జూ వైద్యుడు డాక్టర్‌ ఫణీంద్ర, జూనియర్‌ వెటర్నరీ డాక్టర్‌ పురుషోత్తం, సిబ్బంది సంరక్షణలో గుజరాత్‌ నక్కర్‌బాగ్‌ జూ పార్కు నుంచి శుక్రవారం అర్ధరాత్రి వైజాగ్‌ జూ పార్కుకు ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు. వైజాగ్‌ జూ పార్కు నుంచి ఒక మగ, ఒక ఆడ అడవి కుక్కలను తీసుకెళ్లనున్నారు. కొత్తగా వచ్చిన ఆడ సింహం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా తెలిపారు. ఇప్పటికే జూ పార్కులో ఉన్న ఒక జత సింహాలతో పాటు సింహాల గుంపును ఏర్పరచడంలో సహాయ పడుతుందన్నారు. కొత్తగా వచ్చిన ఆడ సింహాన్ని ప్రొటో కాల్‌ నిబంధనల ప్రకారం కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు.