భిన్నాభిప్రాయాలనూ సహేతుక విమర్శలను భరించలేని అసహన వాతావరణం పెరిగిపోతున్న నేపథ్యంలో దేశంలోనూ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ కాస్త తేడా వచ్చినా వికృత ప్రచారాలకు దిగడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ సర్వసాధారణంగా మారాయి. అమానుష పీడనకు గురైన ఆదివాసుల కోసం నిస్వార్థంగా న్యాయ పోరాటం చేసి జై భీమ్ చిత్రానికి ప్రేరణగా నిల్చిన జస్టిస్ చంద్రు ఇలాంటివారికిప్పుడు టార్గెట్ అవడం విచారకరం. షరా మామూలుగా ప్రతిదాన్ని వైసిపి, టిడిపి కోణాల నుంచి మాత్రమే చూసే ఎ.పి మీడియా, పాలక పార్టీలూ ఇందుకు ఆధ్వర్యం వహిస్తున్నాయి. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తిగా ఏకంగా 96 వేల కేసులు పరిష్కరించి, పదవీ విరమణ వరకూ నిస్వార్థంగా నిరాడంబరంగా వ్యవహరించిన జస్టిస్ చంద్రు ఇప్పుడు దేశంలో న్యాయానికి సామాజిక న్యాయానికి ప్రతీక కావడం గిట్టని చాలా శక్తులు ఇందులో గొంతు కలుపుతున్నాయి. కెవిపిఎస్, ఐలూతో సహా పలు సంస్థలు మానవ హక్కుల దినోత్సవాన విజయవాడ రప్పించి ఎం.బి విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగంలో ఎ.పి హైకోర్టు గురించి, రాజకీయాల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు మింగుడుపడని వీరంతా ఆయన వ్యక్తిత్వానికి మసిపూసే ప్రయత్నం చేస్తున్నారు.
లీగల్ బ్యాటిల్స్‌లో ఎ.పి
ఎ.పి విషయమే తీసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణం సమయంలో భూ సమీకరణ, పర్యావరణ వంటి విషయాలపై పలువురు కేసులు వేసి ఉపశమనం పొందినపుడు ఉత్తర్వులు తెచ్చినపుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించేవారు. జగన్ వచ్చాక ఈ ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలు, అరెస్టులు, కేసులు వంటి చాలా వాటిని హైకోర్టులో సవాలు చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు, మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. రోజుకు రెండు మూడు అలాంటివి సంభవించిన సందర్భాలు కూడా వున్నాయి. ప్రభుత్వం, పాలకపక్షం హైకోర్టుపై బహిరంగంగా ప్రతికూల వ్యాఖ్యలు చేశాయి. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా న్యాయమూర్తులపై లేఖలు రాశారు. ప్రధాన న్యాయమూర్తితో సహా రెండు సార్లు బదిలీ అయ్యారు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి, దాన్ని బలపర్చే మీడియా హైకోర్టు తీర్పులను రాజ్యాంగ ప్రక్రియగా గాక రాజకీయ కోణంలో ప్రచారం చేయడంతో తమ విజయాలుగా చూపుకోవడంతో ఈ ఘర్షణాత్మక వాతావరణం మరింత ముదిరింది. వైసిపి అనుయాయులు హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను సిబిఐ విచారించే వరకూ వెళ్లింది.
సుప్రీం అభ్యంతరం, స్టే
మరోవైపున హైకోర్టు న్యాయమూర్తులు కొందరు చేసిన వ్యాఖ్యలు ఇచ్చిన ఉత్తర్వులు పరిధి మించిపోయాయనే అభిప్రాయం ఏర్పడింది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ నడుస్తున్నదో కుప్పకూలిందో తేలుస్తామని తగు సిఫార్సు చేస్తామని 2020 అక్టోబర్ 1న జస్టిస్ రాకేశ్‌కుమార్ అన్నమాటలు, అందుకోసం చర్యలు ప్రారంభించడం తీవ్ర పరిస్థితికి దారితీశాయి. వాటిని ఉపసంహరించుకోమని అడ్వకేట్ జనరల్ శ్రీరాం కోరినా నిరాకరించిన మీదట రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది.
రాష్ట్రపతి పాలన విధించడం అవసరమా అనే విషయం పరిశీలిస్తామని హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై 2020 డిసెంబర్ 18న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ బాబ్డే నాయకత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. సి.జె బాబ్డే ఇలా అన్నారు: ''లోగడ ఎవరైనా ఇలాంటి ఆదేశాన్ని చూశారా? అత్యున్నత న్యాయస్థానంగా మేము దీన్ని ఆందోళనకరంగా పరిగణిస్తున్నాము. ఈ ఆదేశాన్ని నిలుపుచేస్తున్నాము...''
కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు హైకోర్టుకు రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యం జరిగిందా అని పరిశీలించే అవసరం ఏమొచ్చింది?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది మెహఫూజ్ అషం నజ్కీ కూడా అది హైకోర్టు పనికాదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన అవసరమా అని నిర్ణయించాల్సింది కార్యనిర్వాహకవర్గం మాత్రమేనని, గవర్నర్ నివేదిక తర్వాత రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ఇలాంటి ఉదాహరణలు అటూ ఇటూ కూడా అనేకం వున్నా స్థలాభావం రీత్యా ఇక్కడికి పరిమితం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, హైకోర్టు ఆదేశాల పట్ల అలక్ష్యం గురించి మందలించిన సందర్భాలు కూడా చాలానే వున్నాయి.
రాజధాని కేసులపై అన్నదేమిటి?
విజయవాడ సభలో జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు అక్షరాలా ఇవే. ప్రభుత్వం రాజకీయ పార్టీలతో కాకుండా కోర్టుతో పోరాడుతున్నదని చెప్పడంలో రెండు కోణాలు వున్నాయి. దీనితో ఆయన రాజధాని వికేంద్రీకరణ కేసును కూడా ప్రస్తావించారు. ఇప్పటికి ఏడాదిగా వాయిదా పడుతూ ఈ మధ్యనే పున:ప్రారంభమైన ఈ కేసు ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు రాజధానిలో స్థలాలు పొందిన వారు గనక ఇతరులు విచారించడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ప్రధాన న్యాయమూర్తి ప్రశాంతకుమార్ మిశ్రా ఆ వాదనతో ఏకీభవించలేదు. ఆ నిరాకరణను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరగా చివరలో చూస్తానని అన్నారు. ఈ దశలో ప్రభుత్వ న్యాయవాది సదరు బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పడం, తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిపోయాయి. తాము పాత విధానానికే కట్టుబడి వున్నామనీ, మరింత పకడ్బందీగా తెస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ విధంగా కేసు విచారించి తుది తీర్పునిచ్చే అవకాశం లేకుండా పోయిందని జస్టిస్ చంద్రు అన్నారు. ఈ విషయంలో ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకూ వర్తించే విధంగా వున్నాయి తప్ప ఏకపక్షంగా లేవు. విచారణ త్వరగా జరిగి ప్రతిష్టంభన తొలగిపోవాలన్న భావనే ఇక్కడ కనిపిస్తుంది. వీటిని జగన్ ప్రభుత్వం చెప్పించిందని, ఇదో పెద్ద పథకం ప్రకారం జరిగిందని అభాండాలు వేయడం తగనిపని. అంతటితో ఆగక ఆయన న్యాయ పోరాట చరిత్రపైనే బురదజల్లడం, జై భీమ్ కథను అందులో అత్యంత విషాదకరమైన చినతల్లి పాత్రను కూడా కించపర్చడం వ్యతిరేకుల ఉక్రోషాన్ని, ద్వేషాన్ని వెల్లడిస్తుంది. నిజానికి జై భీమ్ అంతటి విజయం సాధించడం, అందులోనూ జస్టిస్ చంద్రు ప్రకటిత మార్క్సిస్టుగా అంబేద్కర్ భావాలను బలంగా ప్రచారం చేయడం జీర్ణం చేసుకోలేని శక్తులు చాలా వున్నాయని దీంతో మరోసారి రుజువవుతున్నది. జై భీమ్ విడుదల తర్వాత చంద్రుకు బ్రహ్మరథం పట్టిన కొందరు ఈ వ్యాఖ్యలు నచ్చనంత మాత్రాన గౌరవం పోయిందనడం, ఆయన అమ్ముడుపోయారని నిందలు వేయడం ఎంత హీనం?
ఎ.పి హైకోర్టు స్పందన కూడా కొంచెం శ్రుతిమించింది. తమపై వ్యాఖ్యలు చేశారు గనక ఆగ్రహం రావడం అర్థం చేసుకోవచ్చు గాని సినిమాలతో సెలబ్రిటీలుగా మారి ప్రచారం కోసం ఇదంతా చేస్తున్నారనీ, సెలబ్రిటీ లైట్లు ఆర్పేస్తామని వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. న్యాయస్థానాలు దీపాలు వెలిగించాలి గాని ఆర్పకూడదు. తాము మానవ హక్కుల కోసం చాలా చేశామని కొన్ని కేసులను ఉదహరించారు. మంచి చేసినప్పుడు మెచ్చుకున్నట్టే పొరబాటు ధోరణులను విమర్శించడం సహజం. మానవ హక్కుల సభలో ఇవన్నీ మాట్లాడటం తప్పని తప్పు పట్టడం అంటే తమ సీనియర్ న్యాయమూర్తి వాక్‌స్వాతంత్య్రాన్నే ఒప్పుకోవడం లేదన్నమాట.
జాతీయంగానూ చర్చ
వాస్తవానికి జాతీయంగానే ఈ సమయంలో న్యాయ వ్యవస్థపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంటా బయిటా విమర్శలు వస్తున్నాయి. న్యాయమూర్తులు కొంత భిన్నమైన స్థాయిలో వుంటారని సిజెఐ ఎన్.వి.రమణ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యపై న్యాయ పత్రికల్లో విమర్శలు వచ్చాయి. మాజీ సిజెఐ, ప్రస్తుత రాజ్యసభ ఎం.పి రంజన్ గొగోరు 'న్యాయమూర్తికి న్యాయం' అంటూ రాసిన ఆత్మకథ అనేక విధాలైన వ్యాఖ్యలకు దారితీసింది. ఆయన అందులో అయోధ్య తీర్పుతో సహా చాలా వాటిని ప్రస్తావించారు. తన పదవీ కాలం చివరి రోజున ఎలాగైనా దాన్ని పూర్తి చేయాలని ఎంత తాపత్రయపడిందీ చెప్పేశారు. రాఫెల్ తీర్పునూ సమర్థించుకున్నారు. హైకోర్టులకూ సుప్రీం కోర్టుకూ జడ్జిలను సిఫార్సు చేయడంలో కేంద్రం నుంచి ఎదురైన ఒత్తిళ్లను దాదాపుగా అంగీకరించారు. తన కన్నా ముందు సి.జె గా వున్న దీపక్ మిశ్రా తీరుపై తనతో సహా నలుగురు జడ్జిలు మీడియా ముందు చేసిన విమర్శలను సమర్థించుకున్నారు. తనపై ఒక మహిళ చేసిన అరోపణలను విచారించే ధర్మాసనంలో తాను కూడా వుండటం సరికాదని విమర్శలు వచ్చాయని గుర్తుచేస్తూ...తను వుండాల్సింది కాదని ఇప్పుడు ఒప్పుకున్నారు. మనుషులెవరైనా తప్పులు చేస్తారని జోడించారు. ఇక తాను రాజ్యసభకు నామినేషన్ ఒప్పుకోవడంలో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. అంతటితో ఆగక దానివల్ల తనకు ఆర్థికంగా లాభంలేదనీ, ప్రధానమైన చర్చ వుందనుకున్నప్పుడే సభకు వెళ్తా తప్ప రోజు వెళ్లనని కూడా పేర్కొన్నారు (దీనిపై ప్రతిపక్షాలు హక్కుల నోటీసు కూడా ఇచ్చే యోచనలో వున్నాయి). ఇదే విదంగా న్యాయమూర్తుల పెన్షన్ పెంపుపై బిల్లును ఆమోదించే సందర్భంలో పార్లమెంటు సభ్యులు తీవ్రమైన విమర్శలే చేశారు. కొందరు న్యాయమూర్తులు, హైకోర్టుల సి.జెలు కూడా లౌకిక తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సిపిఎం సభ్యుడు జాన్ బ్రిటాస్ రాజ్యసభలో ఆక్షేపించారు. కేంద్రం ఇష్టానుసారం న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు చేస్తున్నదని ఇందుకు వయసు, ప్రతిభ, అనుభవం వంటి కొలబద్దలేవీ నిర్దిష్టంగా పాటించడం లేదని తప్పు పట్టారు. తమకు నచ్చని పేర్లు కొలీజియం సిఫార్సు చేస్తే ఎంతకాలమైనా తేల్చకుండా ఆలస్యం చేస్తారని కూడా గుర్తు చేశారు. ఈ సందర్భంగా సమాధానమిచ్చిన న్యాయ శాఖమంత్రి రిజ్జు తమకు నచ్చని వారి నియామకాన్ని నిలిపేసే హక్కు ప్రభుత్వానికి వుందని చెప్పేశారు. న్యాయమూర్తులను సంప్రదించి నియమించాలనేది కాస్త కొలీజియం ఒప్పుకుంటేనే నియమించాలన్నట్టు మారిపోయిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కొలీజియం విధానంలో లోపాలు చెబుతూనే ప్రభుత్వం ఇంతకాలం తర్వాత జ్యుడిషయల్ కమిషన్ గురించి హడావుడి పడటాన్ని జాన్ బ్రిటాస్ విమర్శించారు. ఇవన్నీ తాజా పరిణామాలేనని గుర్తుచేసుకుంటే న్యాయ వ్యవస్థ ప్రక్షాళన కూడా చాలా అవసరమని స్పష్టమవుతుంది. అయితే వేరుగా చర్చించాల్సిన చాలా లోతైన సమస్య. న్యాయ వ్యవస్థపై చర్చలో ముందువెనక ఇన్ని కోణాలు వుండగా లా మధనంలో ఆరితేరిన జస్టిస్ చంద్రు వంటి వారి వ్యాఖ్యలను అర్ధం చేసుకోవవలసింది పోయి ఆక్రోశించడం అర్ధరహితం.
- తెలకపల్లి రవి










