ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని, వారు నవ సమాజ ప్రగతి సాధకులని ఎయు వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా యూనిట్లు సంయుక్తంగా ఆదివారం ఏయూ డాక్టర్ బిఆర్.అంబేద్కర్ అసెంబ్లీ హాలులో శ్రీ శోభకత్ నామ సంవత్సర ఉగాది సంబరాలను నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు కిరణ్ కృష్ణ పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. సంగీత కార్యక్రమాలతో పాటు క్లాసికల్ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం జర్నలిస్టుల కుటుంబాలకు నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఏయూ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఏయూ నిర్వహిస్తున్న వివిధ కోర్సులలో విద్యార్థుల శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి రంగాలకు పనికి వచ్చే విధంగా నూతన కోర్సులను తీసుకొచ్చామని చెప్పారు. ఎయు అభివృద్ధిలో మీడియా సహకారం ఎంతో అవసరమన్నారు.
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సమాజ చైతన్యానికి జర్నలిస్టులు నాంది అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతంలో జర్నలిస్టుల కృషి ఎనలేనిదని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారిధిగా ఉంటూ సమస్యలను వెలుగులోకి తెస్తూ, పరిష్కారం చూపుతూ చేస్తున్న సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి.రవికుమార్, ఎ.సాంబశివరావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు జి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎన్.రామకృష్ణ, కె.మురళీకృష్ణ, రంగాధామం, బొప్పన రమేష్, కోశాధికారి బి.సీతారామమూర్తి, సంయుక్త కార్యదర్శులు పి.కామన్న, ఇజ్రాయిల్, రమణమ్మ, ఎంవి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్టులను సన్మానించారు.










