ప్రజాశక్తి - ఆదోని
జర్నలిస్టులపై దాడులు చేయడం అమానుషమని నాయకులు, జర్నలిస్టులు విమర్శించారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకుకు సిఐఐ అధికారులు కర్నూలు జిల్లాకు రావడంతో అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడులు చేసి భౌతికంగా గాయపరిచారు. దీనిని వ్యతిరేకిస్తూ ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర, జిల్లా కమిటీ పిలుపుమేరకు సోమవారం జర్నలిస్టు యూనియన్‌తో కలిసి రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ నిరసనతో ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం దద్దరిల్లింది. అంతకుముందు స్థానిక ఎంపిడిఒ కార్యాలయం నుంచి భీమా సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి కర్నూలు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి, జనసేన పార్టీ ఇన్‌ఛార్జీ ఎన్.మల్లప్ప, కాంగ్రెస్ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్, సిపిఎం నాయకులు లక్ష్మన్న మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో నిత్యం ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న విలేకరులపై దాడులు సరైంది కాదని తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆరెకల్ దేవదాసు, మహ్మద్ గౌస్, హుస్సేని, వెంకటేష్, విజరు, రవిలు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టులు విజయేంద్రనాథ్ ప్రసాద్, మల్లికార్జున, రవి, ఎపియుడబ్ల్యుజె జిల్లా కార్యవర్గ సభ్యులు మహేష్ యాదవ్, టిడిపి నాయకులు జైరాం, సజ్జాద్, బాలాజీ, షణ్ముఖ, రవి చౌదరి, రవి, జనసేన నాయకులు తాహేర్ వలి, రాజశేఖర్ పాల్గొన్నారు. చిప్పగిరి తహశీల్దార్ కార్యాలయం దగ్గర ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులను అరెస్టు చేయాలని నిరసన చేపట్టారు. తహశీల్దార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రజ్యోతి కృష్ణమూర్తి, విశాలాంధ్ర తిమ్మప్ప, ప్రజాశక్తి రవి, సాక్షి నీలకంఠ, సూర్య వెలుగు స్టేట్ బ్యూరో యూసుఫ్ పాల్గొన్నారు. ఆలూరులోని అంబేద్కర్ సర్కిల్‌లో నిరసన చేపట్టారు. ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ తహశీల్దార్ విజరు కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సిపిఎం నాయకులు కెపి.నారాయణ స్వామి, టిడిపి నాయకులు సి.నారాయణ రెడ్డి, సిపిఐ నాయకులు రామాంజనేయులు, జర్నలిస్టు నాయకులు స్వరూప్ మాట్లాడారు. ప్రజాసంఘాల నాయకులు షాకీర్, గోవర్ధన్, షఫీ, టిడిపి నాయకులు అశోక్, నారాయణ, నర్సప్ప, భాస్కర్, చంద్రశేఖర్, కొమ్ము రామాంజి, నాగరాజు, రాము, జర్నలిస్టులు శ్రీధర్, రాజేష్, రాంప్రసాద్, కృష్ణ, నాగరాజు, భీమా, గోపాల్, వీరేష్, ముని పాల్గొన్నారు. మంత్రాలయంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో రాజారెడ్డి వారి రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. వైసిపి నాయకులు జర్నలిస్టులపై దాడి చేసి, కెమెరాలు ధ్వంసం చేయడం దారుణమన్నారు. అలాంటి వారిని వెంటనే అరెస్టు చేయాలని, దాడి చేసిన వారిపైనా, దాడికి ప్రోత్సహించిన వారిపైనా హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.










