Sep 21,2023 20:36

కడప జిల్లా ఎస్‌పికి వినతిపత్రం సమర్పిస్తున్న జర్నలిస్టు సంఘాల నాయకులు

కడప సిటీ : కడప జిల్లా వేంపల్లి మండల విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌కు గురువారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే కవరేజీ చేయడానికి వెళ్లిన 9 మంది విలేకరులపై అక్రమ కేసులు బనాయించారని ఎస్‌పికి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న ప్రాంతంలో అనుమతులు లేవని స్వయానా స్థానిక రెవెన్యూ అధికారులు చెబుతున్నప్పటికీ జెపి కన్‌స్ట్రక్షన్‌ వారు ఇసుకను తరలిస్తున్న విషయాన్ని ఎస్‌పికి జర్నలిస్టు సంఘాల నేతలు రామసుబ్బారెడ్డి, నారాయణ, శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదులో జర్నలిస్టులు పనిచేసే సంస్థల పేర్లను నమోదు చేయకున్నా వేంపల్లె ఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌ అత్యుత్సాహంతో మీడియా సంస్థల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని వారు ఎస్‌పి దృష్టి తీసుకువచ్చారు. జర్నలిస్టు సంఘాల నేతల వాదనకు ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌ స్పందిస్తూ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులపై విచారణ చేయించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మీరు, తాము కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కార్యక్రమంలో ఎపియుడబ్ల్యుజె, ఎపిడబ్ల్యుజెఎఫ్‌ నాయకులు రామాంజనేయులురెడ్డి, నూర్‌బాషా, రాజు, సిద్ధయ్య, బాలకృష్ణ, సుదర్శన్‌, శివకేశవరెడ్డి, సుబ్బారెడ్డి, జర్నలుస్టులు జయచంద్ర, ఎ.వి.సుబ్బారెడ్డి, రఘనాధరెడ్డి, ఖదీర్‌, గఫార్‌, రహీంతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.