ప్రజాశక్తి- చింతూరు
జర్నలిస్టులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా, జర్నలిస్టుల సమస్యలపై అంతరరాష్ట్ర ఐక్య పోరాటాలు నిర్వహించాలని సీనియర్ పాత్రికేయులు పిలుపునిచ్చారు. ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా కేంద్రంలో మల్కన్‌గిరి యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ 51వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్రాష్ట్ర జర్నలిస్టుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒయుజె జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు ప్రసన్న మహంతి మాట్లాడుతూ ప్రభుత్వాలు జర్నలిస్టులకు రాయితీలు ఇవ్వకుండా, బీమా సౌకర్యం కల్పించకుండా, నివాస స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. ఎంయుజె అధ్యక్షులు దేవి ప్రసాద్ దాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల కుటుంబాలకు జీవిత బీమా, పిల్లలకు విద్య, వైద్యం సౌకర్యాలు కల్పించాలన్నారు. వార్తలు సేకరించే వృత్తిలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులపై ఇటీవల దాడులు అధికమయ్యాయని, వారి నుంచి జర్నలిస్టులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ విశాల్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలపై ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. మల్కన్‌గిరి ఎస్‌పి వడ్వాని మాట్లాడుతూ ప్రమాదాల సమయంలో అప్రమత్తం చేస్తూ ప్రజా సేవలో అంకితమవుతున్నారని తెలిపారు. ఒడిశా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ మంత్రి జగన్నాథ్ సర్క, మల్కన్‌గిరి, చిత్రకొండ ఎమ్మెల్యేలు ఆదిత్య మాడి, పూర్ణచంద్ర బకా మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రచురించిన కథనాలకు ప్రభుత్వాల నుంచి సత్ఫలితాలు వచ్చిన పాత్రికేయులను వేదికపై పురస్కారాలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా పాత్రికేయులతో పాటు ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రం నుండి సీనియర్ పాత్రికేయులు ఎంబి చారి, ఎస్‌కె.జానీ, ఎస్‌కె.షాజహాన్, పులిపాటి కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.










