ప్రజాశక్తి- సీతమ్మధార జర్నలిస్టులసమస్యలను తక్షణమే పరిష్కరించాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (ఎల్‌ఎన్‌ఎ) అధ్యక్షుడు పి. సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం పౌర గ్రంధాలయంలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు లోబడి పత్రికలను నిర్వహిస్తున్నప్పటికీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు నిరాకరించడం తగదని, పెండింగ్‌లోఉన్న అక్రిడిటేషన్లన్నీ మంజూరు చేయాలని కోరారు.వైసిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జర్నలిస్టులకు 300 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అసోసియేషన్ కార్యదర్శి ధవలేశ్వరపు రవికుమార్ మాట్లాడుతూ కోవిడ్‌తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. స్థానిక దినపత్రికలకు, పిరియాడికల్స్‌కు సమాచార పౌర సంబంధాల శాఖ యాడ్స్‌ను ఇచ్చి, చేయూత నివ్వాలని కోరారు. సీనియర్ జర్నలిస్టు ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని, చిరుపత్రికలకు జిఎస్‌టి నిబంధన తొలగించాలన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.నారాయణరావు మాట్లాడుతూ అక్రిడిటేషన్ జిఒ 142ను సవరించి, జర్నలిస్టు సంఘాలకు అక్రిడిటేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. హేమసుందర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు నెలకు రూ.5వేలు పెన్షన్, ఉచితంగా హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు చక్రవర్తి, రవికాంత్, వెంకట వేణు, తిర్లంగి హరి, శివప్రసాద్, జి ఆనంద్, హరనాథ్, దొండా రమేష్, బాదంగీర్ సాయి, కొణతాల మోహనరావు పాల్గొన్నారు.










